జీహెచ్‌ఎంసీ చేతికి రహదారులు

25 Feb, 2015 00:33 IST|Sakshi
జీహెచ్‌ఎంసీ చేతికి రహదారులు

సిటీబ్యూరో: నగరంలో ఆర్ అంబీ పరిధిలో ఉన్న 240.870 కి.మీ.ల రహదారుల నిర్వహణను జీహెచ్‌ఎంసీకి బదలాయించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా నగరంలోని వివిధ మార్గాల్లో ఎక్స్‌ప్రెస్‌వేలు, మల్టీ లెవెల్ గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. వీటిలో కొన్ని మార్గాలు ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్నాయి. ఎస్‌ఆర్‌డీపీపై గత డిసెంబర్ 26న ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన సమీక్ష సమావేశంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ అంశాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో ఆర్‌అండ్‌బీ నిర్వహణలో ఉన్న రహదారులను జీహెచ్‌ఎంసీకి బదలాయించాల్సిందిగా అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జీవో జారీ చేశారు. నేషనల్ హైవేలు మినహాయించి రాష్ట్ర హైవే, జిల్లాల్లోని మేజర్ రహదారులను  జీహెచ్‌ఎంసీకి బదలాయించారు. ఇందులో 208.070 కి.మీ.లు మేజర్ జిల్లా రోడ్లు...మిగిలిన 32.800 కి.మీ.లు రాష్ట్ర రహదారులు.

త్వరలో యూహెచ్‌పీలూ...

 ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్బన్ హెల్త్ పోస్టులు (యూహెచ్‌పీలు) త్వరలో జీహెచ్‌ఎంసీ పరిధిలోకి రానున్నాయి. ఇప్పటి వరకూ యూహెచ్‌పీలకు అవసరమైన మందులు, భవనాల నిర్వహణ తదితరాలను జీహెచ్‌ఎంసీయే చూస్తోంది. నగరానికి సంబంధించి ఆరోగ్యం-పారిశుద్ధ్యం నిర్వహణ దీని పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు .. ముఖ్యంగా పేదబస్తీల్లోని వారికి ఆరోగ్య సేవలు అందించేందుకు యూహెచ్‌పీల నిర్వహణ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉండాలని గతంలో స్టాండింగ్ కమిటీ, సర్వసభ్య సమావేశాల్లోనూ ప్రస్తావించారు. ప్రస్తుతం స్వైన్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్యం, పారిశుద్ధ్యం అంశాలపై శ్రద్ధ చూపిన జీహెచ్‌ఎంసీ అధికారులు ఆరోగ్య కేంద్రాల నిర్వహణ జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోనే ఉంటే బాగుంటుందనే తలంపుతో ఉన్నారు. తద్వారా ఆరోగ్యం-పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహనతో పాటు బస్తీల్లో వైద్యశిబిరాలు నిర్వహించేందుకూ వీలుంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి ప్రభుత్వం ఒప్పుకుంటుందనే నమ్మకంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు