ఏ హాని తలపెట్టొద్దు: పూర్ణిమ తల్లి

13 Jun, 2017 11:33 IST|Sakshi
ఏ హాని తలపెట్టొద్దు: పూర్ణిమ తల్లి

హైదరాబాద్‌: నగర శివారులోని బాచుపల్లి పీఎస్ పరిధిలో బాలికల అదృశ్యంపై వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటివరకూ ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం కాగా ఒకరి జాడ గుర్తించగా, మరో ఇద‍్దరి ఆచూకీ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. అయితే అయిదు రోజుల కిందట అదృశ్యమైన 10 వతరగతి విద్యార్థిని పూర్ణిమ జాడ లభ్యం కాకపోవడంతో విద్యార్థిని తల్లి విజయ కన్నీటి పర్యంతమయ్యారు. ఐదు రోజుల కిందట పూర్ణిమ అదృశ్యం కాగా, సోమవారం దుర్గాదేవి, యామిని అనే బాలికలు కనిపించకుండాపోయారు. కాగా, విచారణ వేగమంతం చేసిన పోలీసులు యామిని ఆచూకీ కనిపెట్టారు. ఆ విద్యార్థిని బంధువుల ఇంట్లో ఉందని గుర్తించి ఆమె తల్లిదండ్రులకు ఊరట కలిగించారు.

పూర్ణిమ తల్లి విజయ మీడియాతో మాట్లాడుతూ.. మా కూతురు పూర్ణిమ బయటకు వెళ్లింది.. కానీ ఇంటికి తిరిగిరాలేదని బాలిక తల్లి వ్యక్తం చేశారు. ఎవరితోనూ గొడవపడలేదని, స్కూల్లోనూ అందరితోనూ కలిసి పోయేదని చెప్పారు. పెద్దవాళ్లమైనా మాతో ఏదైనా గొడవ ఉంటే మాతోనే చూసుకోవాలని.. తమ కూతురికి ఎలాంటి హాని తలపెట్టొద్దని విజయ వేడుకున్నారు. ఎవరు కిడ్నాప్ చేశారో.. ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియడం లేదన్నారు.  తమ కూతురి ఆచూకీ తెలిసిన వారు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత వార్తలు
 హైదరాబాద్‌లో బాలికల అదృశ్యం కలకలం