మరిన్ని నిధులివ్వండి

20 Apr, 2016 00:22 IST|Sakshi
మరిన్ని నిధులివ్వండి

♦ కరువును ఎదుర్కొనేందుకు సాయం చేయండి
♦ కేంద్ర మంత్రులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
♦ రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సమీక్షించిన కేంద్ర మంత్రులు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత సాయం అందించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఒకరోజు పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్రసింగ్, తాగునీటి సరఫరా శాఖ మంత్రి రాంకృపాల్ యాదవ్‌లు మంగళవారం ఇక్కడి కరువు పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 231 కరువు మండలాల  కోసం మొత్తం రూ.3,064 కోట్లు కావాలని కోరితే... కేంద్రం రూ.791కోట్లు మాత్రమే మంజూరు చేసిందని చెప్పారు. తాగునీటి సరఫరా కోసం రూ.555 కోట్లు కోరితే... ఇప్పటివరకు అందినది రూ.72కోట్లు మాత్రమేనని వివరించారు. ఈ రెండు అంశాల్లో మరింత సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో నీతి ఆయోగ్ ద్వారా మరిన్ని నిధులు తీసుకునేందుకు ప్రయత్నించాలని కేంద్ర మంత్రులు సూచించారు. గ్రామాల్లో కొన్ని రకాల కరువు పనులకు (పశువుల కోసం తాగునీటి తొట్లు, ఇంకుడు గుంతలు వంటివాటికి) ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ నిధులను వినియోగించుకోవాలని చెప్పారు.

 ఉపాధికి మరో రూ.వెయ్యి కోట్లు ఇవ్వండి
 రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా శాశ్వత ఆస్తుల రూపకల్పన చేస్తున్నామని కేంద్ర మంత్రులకు మంత్రి కేటీఆర్ వివరించారు. వెయ్యి గ్రామ పంచాయతీ భవనాలను, 1,100 అంగన్‌వాడీ కేంద్రాలను ఈ ఏడాది నిర్మించనున్నట్లు చెప్పారు. స్వచ్ఛ భారత్ పథకం కింద రాష్ట్రంలోని గ్రామాల్లో చెత్త సేకర ణకు పెద్ద సంఖ్యలో ట్రైసైకిళ్లు కొనుగోలు చేశామని, ప్రతి గ్రామానికి ఒక డంపింగ్ యార్డు ఉండేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఉపాధి హామీ పథ కం కింద కరువు మండలాల్లో అదనపు పనిదినాల కల్పనకు మరో రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరారు. దీంతో రాష్ట్రానికి నిధుల కొరత లేకుండా చూస్తామని కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ హామీ ఇచ్చారు. ఉపాధి పథకం కింద దేశవ్యాప్తంగా త్వరలోనే మరో రూ.8వేల కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు.

 మిషన్ భగీరథకు ప్రశంసలు
 రాష్ట్రంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ ప్రాజెక్టును చేపట్టడం అభినందనీయమని కేంద్ర మంత్రులు ప్రశంసించారు. భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలకు ఈ ప్రాజెక్టు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం, నిధుల సేకరణ అంశాలను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు త్వరలోనే మరోసారి వస్తానని, కేంద్రం తరఫున సాయం అందించేందుకు కృషి చేస్తానని బీరేంద్రసింగ్ హామీ ఇచ్చారు. గ్రామాల్లో అంతర్గత పైప్‌లైన్ పనులకు ఉపాధి హామీ పథకం నిధులను, పంచాయతీల అభివృద్ధి నిధులను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్, డెరైక్టర్ అనితా రాంచంద్రన్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు