వలసలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

25 Feb, 2016 02:49 IST|Sakshi
వలసలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

పార్టీ నేతలకు చంద్రబాబు సూచన
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహచర నేతలకు సూచించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీని రాజకీయంగా దెబ్బతీసి నైతికంగా బలహీన పరిచేందుకు ప్రతిరోజూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీలో చేరే లా ప్రణాళికలు రూపొందించటంతోపాటు చివరి వరకూ గోప్యంగా ఉంచాలని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల నాటికి ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 30 నుంచి 40 మందికి వివిధ కారణాలతో టికెట్లు ఇవ్వలేమని, నియోజకవర్గాల పెంపు వల్ల మరో 50 సీట్లు అదనంగా వస్తాయని, ఇన్ని స్థానాలకు చివరి నిమిషంలో అభ్యర్థులు దొరకటం కష్టం కాబట్టి ప్రతిపక్షం నుంచి సాధ్యమైనంత ఎక్కువమందిని చేర్చుకునే పనిలో నేతలు నిమగ్నం కావాలని హితోపదేశం చేశారు.

టీడీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం బుధవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం లో జరిగింది. ఫిరాయింపులపై ఏ రాజకీయ పార్టీ ప్రశ్నించినా ఎదురుదాడి చేయాల్సిందిగా చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో పెద్దసంఖ్యలో ఫిరాయింపులు జరిగినపుడు స్పందించని పార్టీలు ఇపుడు తప్పుపట్టటమేంటని ప్రశ్నించటం ద్వారా గట్టిగా సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించినవారు రాజీనామా చేయాలని, వారి రాజీనామాల్ని ఆమోదించాలని వైఎస్సార్‌సీపీ ఎంత ఒత్తిడి తెచ్చినా పట్టించుకోవద్దన్నారు.
 
ఎనిమిదో అద్భుతంలా అమరావతి
సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రపంచంలో ఎనిమిదో అద్భుతంలా రాజధాని అమరావతిని నిర్మిస్తామని, ఇందుకు తగ్గట్టుగా నిర్మాణ శైలి ఉండాలని అంతర్జాతీయ నిర్మాణరంగ నిపుణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు  సూచించారు. రాజధానిని పరిపాలన కేంద్రంగానే పరిమితం చేయకుండా ఆర్థిక కార్యకలాపాలకు వేదిక చేస్తామన్నారు. తద్వారా అమరావతిని అందరూ నివసించేలా ప్రజారాజధానిగా చేయడం సాధ్యమవుతుందని చెప్పారు.

అంతర్జాతీయ నిర్మాణరంగ నిపుణులు, వాస్తుశిల్పులతో పరిపాలన-నివాస సముదాయ భవనాల నిర్మాణ డిజైన్లపై సీఎం బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సృజనాత్మకతను రంగరించి.. తగిన ప్రణాళికలు రూపొందించాలని కోరారు.
 
డిజైన్ల పోటీ..:
సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్‌భవన్,ప్రజాప్రతినిధులు, మంత్రుల నివాస సముదాయాల్ని 900 ఎకరాల్లో నిర్మిం చేందుకు డిజైన్ల పోటీ నిర్వహిస్తున్నట్లు సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ పోటీలో పాల్గొంటున్న సంస్థలకు లక్షా 50 వేల డాలర్లను ముందుగా చెల్లిస్తున్నట్లు తెలిపారు. మార్చి 22, 23, 24 తేదీల్లో ఈ సంస్థలు డిజైన్లు సమర్పిస్తాయని, వాటిలో ఒకదానిని క్రిస్టోఫర్ బెనింజర్ చైర్మన్‌గా గల ఆరుగురు సభ్యుల అంతర్జాతీయ కమిటీ మార్చి 25న ఎంపిక చేస్తుందని చెప్పారు.

కాగా, జపాన్‌కు చెందిన జైకా ప్రతినిధి బృందం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలసింది. రెండురోజులుగా ప్రతిపాదిత విజయవాడ మెట్రో ప్రాజెక్టు కారిడార్లను పరిశీలిస్తున్న బృందం ఆయనతో సమావేశమై రుణం గురించి చర్చించింది. మరోవైపు  రహదారుల స్థితిగతులను సమగ్ర విధానంతో సర్వే చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన అధునాతన సాంకేతిక వాహనాన్ని  బాబు  విజయవాడలో ప్రారంభించారు.

మరిన్ని వార్తలు