'దసరాకు కొత్త జిల్లాలు.. సూచనలు చేయండి'

29 Jun, 2016 17:43 IST|Sakshi

హైదరాబాద్: దసరా పండుగ నాటికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేయాల్సివుందని.. అందుకు అవసరమైన సూచనలు చేయండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలను కోరారు. బుధవారం కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై టీఆర్ఎస్ఎల్పీ సమావేశమైంది. ఈ సమావేశంలో జిల్లాలు, మండలాల ఏర్పాటుపై చర్చకొనసాగుతోంది. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుందని కేసీఆర్ తెలిపారు. కొత్తగా 14 జిల్లాలు, 74 మండలాలుగా విభజిస్తున్నట్టు వెల్లడించారు. కొత్త జిల్లాలపై త్వరలో అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు.

ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా భేటీ అయ్యారు. జిల్లా, మండల పునర్ వ్యవస్థీకరణపై చర్చించారు. తమ ప్రతిపాదనలకు కేసీఆర్కు ఎమ్మెల్యేలు అందజేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఒక్కొక్కరూ తమ జిల్లాలో ఏర్పడే కొత్త జిల్లాకు పలు పేర్లను సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాకు మంజీర పేరు పెట్టాలని మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. వరంగల్ జిల్లాలో కొత్తగా ఏర్పడే జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు, ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడే జిల్లాకు కొమరం భీం పేరు పెట్టాలని ఎమ్మెల్యేలు తీర్మానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ ప్రతిపాదనలను కే.కేశవరావుకు అందజేశారు.

>
మరిన్ని వార్తలు