గ్లామర్‌ పార్ట్‌ పూర్తయింది

12 Aug, 2017 02:39 IST|Sakshi
గ్లామర్‌ పార్ట్‌ పూర్తయింది
- సెప్టెంబర్‌లో సెకండ్‌ పార్ట్‌ మొదలవచ్చు
డ్రగ్‌ కేసులో ఎక్సైజ్‌ ఈడీ అకున్‌ సబర్వాల్‌
 
సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్‌ కేసులో మొదటి ఎపిసోడ్‌ గ్లామర్‌ పార్ట్‌ విచారణ పూర్తయిందని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ స్పష్టం చేశారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇక రెండో జాబితా ఉండబోదని పరోక్షంగా వెల్లడించారు. శుక్రవారం ఇఫ్లూలో డ్రగ్స్‌ నియంత్రణపై జరిగిన అవగాహన కార్యక్రమంలో భాగంగా అకున్‌ మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు అరెస్టయిన వారి విచారణలో వెల్లడైన అంశాలను బట్టి సెప్టెంబర్‌లో రెండో జాబితా ఉంటుందని తెలిపారు. తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, స్వతంత్రంగా, స్వేచ్ఛగా విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇప్పటివరకు డ్రగ్స్‌ వ్యవహారంలో 11 కేసులు నమోదయ్యాయని, వాటిలో చార్జిషీట్‌ వేసేందుకు కసరత్తు పూర్తి చేశామన్నారు. పలువురి రక్తం, గోర్లు, వెంట్రుకల శాంపిల్స్‌ సేకరించామని, వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని చెప్పారు. ఆ రిపోర్టుల కోసం వేచిచూస్తున్నామని, అవి అందగానే చార్జిషీట్‌ దాఖలు చేస్తామని తెలిపారు.