నగరంలో గ్లోబల్‌ యూనివర్సిటీ సిస్టమ్స్‌

27 Mar, 2018 02:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యూరప్‌లోని ప్రముఖ విద్యా రంగ సంస్థల్లో ఒకటైన గ్లోబల్‌ యూనివర్సిటీ సిస్టమ్స్‌ (జీయూఎస్‌) దేశంలో తన తొలి కార్యాలయాన్ని నగరంలోని హైటెక్‌ సిటీ భవన సముదాయంలో ప్రారంభించింది. దేశ విద్యా రంగానికి సంబంధించిన సాంకేతిక అభివృద్ధి, డిజిటల్‌ కార్యకలాపాలు, వ్యాపార శక్తి సామర్థ్యాలకు ఊతం కలిగించాలనే లక్ష్యంతో 100 మంది ఉద్యోగులతో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోని వర్సిటీలు, కళాశాలలకు వినూత్న పరిష్కారాలను సంస్థ అందించనుంది.

దీని ద్వారా ఉద్యోగాలు సృష్టించడం, నగరానికి పెట్టుబడులు తీసుకురావడం, మానవ వనరులను అంతర్జాతీయంగా వినియోగించుకునేందుకు సంస్థ తోడ్పాటు అందించనుంది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదివారం సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. సంస్థకు అవసరమైన ఉద్యోగులకు తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ద్వారా శిక్షణ కల్పిస్తామన్నారు.

జీయూఎస్‌ వ్యవస్థాపకుడు, జీఈవో ఆరోన్‌ ఇటింగెన్‌ మాట్లాడుతూ, ప్రస్తుతం 100 మందితో నగరంలో తమ కార్యాలయాన్ని ప్రారంభించామని, రానున్న రోజుల్లో ఉద్యోగుల సంఖ్య మరింత పెంచాలనే ఉద్దేశంతో ఉన్నామన్నారు. దేశంలోని ఔత్సాహిక, అత్యున్నత స్థాయి ఉద్యోగులను వినియోగించుకుని దేశ విద్యా రంగంలో సంచలనాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, జీయూఎస్‌ (ఇండియా) ఎండీ శశి జలిగామ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు