రేపు గోదావరి బోర్డు సమావేశం

28 Aug, 2015 02:40 IST|Sakshi

రెండు రాష్ట్రాలకు లేఖలు పంపిన బోర్డు సభ్యకార్యదర్శి
భేటీలో పట్టిసీమే ప్రధానాంశం!
 
హైదరాబాద్: గోదావరి బోర్డు సమావేశం ఈ నెల 29న జరగనుంది. రాఖీపౌర్ణమిని పురస్కరించుకుని 29న గోదావరి బోర్డుకు సెలవు దినం అయినప్పటికీ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఉన్న దృష్ట్యా శనివారమే భేటీ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు బోర్డు సభ్య కార్యదర్శి రామ్‌శరణ్ లేఖలు పంపారు. ప్రస్తుతం జరిగే సమావేశ ఎజెండాలో బోర్డుకు అధికారుల కేటాయింపు, కార్యాలయ నిర్వహణ ఖర్చులకు నిధుల అంశం వంటి ఏడు విషయాలను పొందుపరచగా, పట్టిసీమ ప్రాజెక్టు అంశంపైనే ప్రధానంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం 80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా అక్రమమని, రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఈప్రాజెక్టును చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బోర్డుకు ఫిర్యాదు చేసింది.

అపెక్స్ కౌన్సిల్ కానీ, బోర్డు అనుమతి కానీ లేకుండానే ప్రాజెక్టును చేపడుతోందని, రాష్ట్ర హక్కులకు భంగం కలిగేలా చేపడుతున్న ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరింది. ఇది ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84(3), 85(8)లకు వ్యతిరేకంగా ఉందని, గతంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల మధ్య జరిగిన ఒప్పందం మేరకు పోలవరం ప్రాజెక్టు నుంచి మాత్రమే 80 టీఎంసీల నీటిని మళ్లించాలని, అంతకుమించి నీటిని మళ్లిస్తే, ఆ నీటిని మూడు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలని పేర్కొన్నా వాటన్నింటినీ ఉల్లంఘిస్తోందని రాష్ట్రం బోర్డుకు రాసిన లేఖలో తెలిపింది.

పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమే అయితే 80 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాలకు ఉన్న 35 టీఎంసీల వాటాను కర్ణాటక, మహారాష్ట్రలు కృష్ణా జలాల్లో మినహాయించుకునే అవకాశం ఉంటుంది. మిగతా 45 టీఎంసీల వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినది కాగా ఆ నీటిని వాటాల మేరకు పంచుకుంటే తెలంగాణకు 19 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుందనేది రాష్ట్రం వాదనగా ఉంది. కానీ ఈ వాదనను ఏపీ కొట్టిపారేస్తోంది. ఈ అంశాన్ని బోర్డు ముందు పెట్టి అక్కడ ఏపీ చేసే వాదనను బట్టి ముందడుగు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా