గోల్కొండలో స్వాతంత్య్ర వేడుకలు

3 Aug, 2016 03:32 IST|Sakshi
గోల్కొండలో స్వాతంత్య్ర వేడుకలు

ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోటలో ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో మంగళవారం అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరేడ్ గ్రౌండ్‌లోని వీరుల సైనిక్ స్మారక్ వద్ద సీఎం కె.చంద్రశేఖర్‌రావు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం గోల్కొండ కోటలో ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.

స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా రాజ్‌భవన్, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, చార్మినార్ తదితర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా తగు బందోబస్తు, పార్కింగ్ ఏర్పాటు చేయాలని, నిరంతరం విద్యుత్ సరఫరా అందించాలని, బారికేడ్లు, మంచినీటి సరఫరా, గోల్కొండకు వెళ్లే మార్గంలో సైన్ బోర్డులు, పరిసరాల శుభ్రత, మొబైల్ టాయిలెట్స్, ఆర్టీసీ ద్వారా ప్రత్యేక మినీ బస్సులు, వేదిక వద్ద పుష్పాలతో అలంకరించాలని ఆదేశించారు.

తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా గోల్కొండ కోటలో సాంస్కృతిక కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, ముఖ్యకార్యదర్శులు రాజేశ్వర్ తివారి, అధర్ సిన్హా, రాజీవ్ త్రివేది, సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు