ఆగని ‘కొరియర్’ దందా

27 Aug, 2013 03:51 IST|Sakshi

సాక్షి,సిటీబ్యూరో: నగరంలో ఎన్ని ఉదంతాలు చోటుచేసుకుంటున్నా..దుండగులు ఎన్నిసార్లు పంజా విసిరినా...బంగారం వ్యాపారుల్లో మాత్రం మార్పు రావట్లేదు. యంత్రాంగాలు పట్టనట్లు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కొరియర్ సంస్థల ద్వారా రూ.కోట్ల విలువైన బంగారం,వజ్రాలను తెప్పించేస్తున్నారు. ముం బై సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు చెందిన గవర్నమెంట్ రైల్వే పోలీసు (జీఆర్పీ) అధికారులు గురువారం ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడంతో ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది.

సూరత్ నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ జ్యువెలరీ దుకాణంలో డెలివరీ ఇచ్చేందుకు వీరు తీసుకొస్తున్న రూ.కోటి విలువైన బంగారం వజ్రాలను జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై సెంట్రల్ స్టేషన్‌లో జైపూర్ సూపర్ ఫాస్ట్‌ఎక్స్‌ప్రెస్ దిగిన కౌషల్ తివారీ,భరత్ పటేల్, శైలేంద్రసింగ్ వెనుక గేటు ద్వారా స్టేష న్ దాటేందుకు యత్నిస్తుండగా జీఆర్పీ సిబ్బ ంది అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. వాటిలో ఎలాంటి బిల్లులు, పత్రాలు లేని రూ. కోటి విలువైన బంగారం,వజ్రాలు ఉండటంతో స్వాధీనం చేసుకున్నారు.

విచారణ నేపథ్యంలో తాము బీవీ చినాయ్ అనే కొరియర్ సంస్థ ఉద్యోగులమని, సూరత్‌లోని బీడీ జ్యువెలర్స్ నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థకు ఈ సొత్తును డెలివరీ చేయడానికి వెళ్తున్నామని చెప్పడంతో విషయాన్ని  ఐటీశాఖకు చేరవేశారు. అయితే ఇక్కడ జీఆర్పీ అధికారులకు అంతుచిక్కని విషయం వారు ప్రయాణిస్తున్న మార్గమే. సూరత్‌కు చెందిన అనేక మంది బంగారం వ్యాపారులు పన్నుల్ని తప్పించుకోవడానికి బంగారం,వజ్రాలను ఇలానే డెలివరీ చేస్తున్నారంటూ ఈ త్రయం బయటపెట్టారు. దీంతో ఈ కేసును జీఆర్పీ  పోలీసులు ఐటీ అధికారులకు అప్పగించారు.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు