బూట్లలో బంగారం!

1 Feb, 2017 00:10 IST|Sakshi
బూట్లలో బంగారం!
  • జెడ్డా నుంచి స్మగ్లింగ్‌ చేసిన హైదరాబాదీలు
  • పట్టుకున్న కస్టమ్స్, కేజీపైగా పసిడి స్వాధీనం
  • సాక్షి, హైదరాబాద్‌: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమ రవాణా చేసే స్మగ్లర్లు నానాటికీ తెలివి మీరిపోతున్నారు. ఓ కొత్త పంథాను అధికారులు ఛేదించేసరికి మరో సరికొత్త మార్గాన్ని అనుసరిస్తున్నారు. పాదాలకు బంగారం అమర్చుకుని, కడియాలుగా మార్చుకుని వచ్చిన ఇద్దరు హైదరాబాదీలను శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కస్టమ్స్‌ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. వీరి నుంచి రూ.32.6 లక్షల విలువైన 1.1 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీకి చెందిన ఇరువురు సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి మంగళవారం ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం(నంబర్‌ ఏఐ–966)లో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు.

    వీరు బంగారం అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం అందుకున్న కస్టమ్స్‌ ఆధీనంలోని ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(ఏఐయూ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. చేతులకు కడియాల రూపంలో, బూట్లలో దాచిన బంగారం బయటపడింది. స్మగ్లర్లు మొత్తం 1.1 కేజీల బంగారాన్ని రెండు కడియాలు, నాలుగు బిస్కెట్ల రూపంలోకి మార్చారు. కడియాలను ఇరువురూ తమ చేతులకు ధరించారు. బిస్కెట్లను మాత్రం పాదాలకు కింది భాగంలో పెట్టి ఊడిపోకుండా సెల్లో టేప్‌ వేశారు. దానిపై సాక్స్‌ వేసుకుని బూట్లు ధరించారు. ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు