బంగరు భవితను మింగేసిన బియాస్

9 Dec, 2014 00:06 IST|Sakshi
బంగరు భవితను మింగేసిన బియాస్

ఆ  ఘటనకు  ఆర్నెళ్లు....

బియాస్ దుర్ఘటనకు ఆరునెలలు
బాధిత కుటుంబాలను ఆదుకున్న తెలంగాణ, హిమాచల్ సర్కార్‌లు
ఎక్స్‌గ్రేషియాకు హామీ ఇచ్చి అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం
ఘటనతో సంబంధం లేదంటున్న యాజమాన్యం
నేడు హిమాచల్ కోర్టు తుది తీర్పు
సిమ్లాకు బాధిత కుటుంబాలు

 
అదో పీడకల.. 24 మంది భావి ఇంజినీర్లను పొట్టన పెట్టుకున్న బియాస్ దుర్ఘటన. తలుచుకుంటేనే నగరవాసుల గుండెలు బరువెక్కుతాయి... కన్నవాళ్లకు పుట్టెడు శోకం మిగిల్చి కోరలు సాచిన బియాస్ నది ప్రవాహంలో కొట్టుకుపోయిన భావిభారత ఇంజినీర్ల కుటుంబాలకు నేటికీ సాంత్వన కలగలేదు.. ఈ ఘటనతో తమకు సంబంధం లేదంటోంది కళాశాల యాజమాన్యం. తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ అధ్యయనం సాగుతూనే ఉంది.. ఇది జరిగి అప్పుడే ఆరు నెలలు గడచిపోయాయి.. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నట్టు తెలిసింది..
 
ఆ టూర్‌తో మాకు సంబంధం లేదు : కాలేజీ అఫిడవిట్

అందరినీ కలచివేసిన బియాస్ దుర్ఘటన విషయంలో వీఎన్‌ఆర్ వీజేఐటీ కళాశాల యాజమాన్యం పాఠాలు నేర్వలేదు. స్టడీటూర్‌కు బయలుదేరిన విద్యార్థులు తాము చెప్పినా వినకుండా లార్జీడ్యామ్ సందర్శనకు వె ళ్లారని, తమకు ఈ టూర్‌కు సంబంధమే లేదని హిమాచల్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. దీనికితోడు మరణించిన విద్యార్థులకు సంబంధించిన ఫీజులు, బ్యాంకు రుణాలకు సంబంధించిన అంశాలను కాలేజీ యాజ మాన్యం పరిష్కరించలేదని లార్జీ డ్యామ్ ఘటనలో మరణించిన బానోతు రాంబాబు తండ్రి శేఖర్‌నాయక్ ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు.
 
 నగరానికి చెందిన బాచుపల్లి వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు విద్యార్థులు ఈ ఏడాది జూన్ మొదటి వారంలో విహార యాత్రకు వెళ్లారు. 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లో బియాస్‌నదిపై నున్న లార్జీ డ్యామ్ వరద ప్రవాహంలో కోట్టుకుపోయి 24 మంది విద్యార్థులు (ఒక టూర్ ఆపరేటర్ కూడా) మృత్యువాత పడ్డారు. దుర్ఘటన జరిగిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తుందని ప్రకటించారు. ఆరునెలలు గడచినా బాధిత కుటుంబాలకు పరిహారం అందకపోవడం గమనార్హం. మరోవైపు బియాస్ దుర్ఘటన జరిగిన తీరుపై తెలంగాణ సర్కారు ఏర్పాటుచేసిన శైలజా రామయ్యర్ కమిటీ సైతం ఆరునెలలుగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించక పోవడం గమనార్హం. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన హిమాచల్ ప్రదేశ్  ప్రభుత్వం మాత్రం బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల చొప్పున పరిహారం అందజేసింది. హిమాచల్ కోర్టు ఆదేశం మేరకు లార్జీ డ్యామ్ అధికారులు, వీఎన్‌ఆర్ కళాశాల యాజమాన్యం వేర్వేరుగా తక్షణ సహాయంగా రూ.2.50 లక్షల చొప్పున బాధితులకు పరిహారంగా అందజేశాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది.  ఈ దుర్ఘటనపై నమోదైన కేసుకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మంగళవారం తుదితీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుతోనైనా సాంత్వన చేకూరుతుందని బాధిత కుటుంబాలు ఆశిస్తున్నాయి.  
 
అధ్యయనం పూర్తయ్యేనా..

దుర్ఘటనపై అధ్యయనం జరిపి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ నేతృత్వంలో ఓ కమిటీని ఆరు నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కేవలం బియాస్ దుర్ఘటన జరిగిన తీరుకే ఈ అధ్యయనం పరిమితం కావడం గమనార్హం. దుర్ఘటన జరిగి ఆరు నెలలు గడిచినా అధ్యయనం పూర్తిచేసేందుకు వచ్చే ఏడాది జనవరి 15 వరకు సమయం కావాలని ఆమె ప్రభుత్వాన్ని తాజాగా కోరినట్లు తెలిసింది.
 
హైకోర్టు తీర్పుతో న్యాయం?
 
బియాస్ దుర్ఘటనపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నట్లు తెలిసింది. గతంలోనే లార్జీ డ్యామ్ అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టు సీరియస్ అయిన విషయం విదితమే. తాజా తీర్పుతో బాధిత కుటుంబాలకు ఒకింత సాంత్వన కలుగుతుందని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోన్న కళాశాలల నిర్లక్ష్యంపై చెంపపెట్టు అవుతుందని అందరూ అశిస్తున్నారు. ఈ తీర్పు కోసం బాధిత కుటుంబాల సభ్యులు పలువురు ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌కు బయలుదేరి వెళ్లారు.
 
 పరిహారం.. పరిహాసం..

 బియాస్ దుర్ఘటన జరిగిన వెంటనే ఏపీ ప్రభుత్వం తరఫున ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినప్పటికీ ఆరునెలలుగా బాధిత కుటుంబాలకు పరిహారం అందకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుట్టెడు దుఖాఃన్ని దిగమింగుకుంటూ కాలం వెల్లదీస్తోన్న విద్యార్థుల తల్లిదండ్రులకు సర్కారు తరఫున మాత్రం సాయం అందుతుందన్న ఆశ అడియాశే అయింది.కాగా దుర్ఘటన జరిగిన వెంటనే మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రులు, ఉన్నతాధికార బృందం ప్రత్యేక విమానంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి పంపి హడావుడి సృష్టించి డాబు ప్రదర్శించిన ఏపీ సర్కారు పెద్దలు.. ఆచరణలో చేతులెత్తేసి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

మరిన్ని వార్తలు