ఏప్రిల్‌ 29న గొల్ల, కురుమల సభ

12 Feb, 2018 02:45 IST|Sakshi

 మంత్రి తలసాని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: గొల్ల, కురుమల సంక్షేమానికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఏప్రిల్‌ 29న హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తెలిపారు. ఆదివారం జరిగిన గొల్ల, కురుమల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గొర్రెల షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై నిధులిస్తుందని పేర్కొన్నారు. 31 జిల్లాల్లో గొల్ల, కురుమల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసేందుకు కృషిచేస్తానని హామీనిచ్చారు.

సభ విజయవంతానికి ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. జన సమీకరణ కోసం ఏప్రిల్‌ మొదటి వారంలో జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. సమావేశంలో గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్‌ రాజయ్యయాదవ్, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశం, అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు రవీందర్‌యాదవ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ పాల్గొన్నారు.  

సీఎం దృష్టికి కురుమల సమస్యలు
కురుమల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి జోగురామన్న అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కురుమ మహావేదిక ఆవిర్భావ సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కులాలు, సంచార జాతుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. అత్యంత వెనుకబడిన కురుమలను ఎంబీసీల్లో చేర్చాలని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు