‘బల్క్’మీటర్ల టెండర్లలో గోల్‌మాల్

9 Jan, 2014 06:16 IST|Sakshi
‘బల్క్’మీటర్ల టెండర్లలో గోల్‌మాల్

=కేటు కంపెనీకి రూ.12.58 కోట్ల కాంట్రాక్ట్!
 =ముఖ్య నేత సోదరుని ‘హస్తం’
 =ఐదేళ్ల నిర్వహణ బాధ్యతలూ ఆ కంపెనీకే..
 =పట్టనట్టు వ్యవహరిస్తున్న జలమండలి

 
సాక్షి, సిటీబ్యూరో : కేటు కంపెనీకి అధికారం అండగా నిలిచింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.12.58 కోట్ల టెండర్ కట్టబెట్టేలా చేసింది. ప్రభుత్వ ‘ముఖ్య’ నేత సోదరుని అండతో బ్లాక్‌లిస్టులో పెట్టిన కంపెనీ గ్రేటర్ పరిధిలో దర్జాగా బల్క్‌కుళాయిలకు నీటి మీటర్లను ఏర్పాటు చేసే టెండర్ ను దక్కించుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ మున్సిపాల్టీ నాలుగేళ్ల పాటు ఈ కంపెనీ నిర్వాకాన్ని పసిగట్టి 2010లోనే బ్లాక్‌లిస్టులో పెట్టింది.కానీ సదరు కంపెనీని జలమండలి ముద్దు చేసింది. అంతేకాదు మహానగరం పరిధిలో ఏకంగా 1318 బడా కుళాయిలకు నీటి మీటర్ల ఏర్పాటుతోపాటు వాటిని ఐదేళ్లపాటు నిర్వహణ(మెయింటినెన్స్)ను చేపట్టే టెండరును కట్టబెట్టడం సంచలనం సృష్టిస్తోంది. ముఖ్య నేత సోదరుని ఒత్తిడి కారణంగానే ఈ రంగంలో సుదీర్ఘ అనుభవం గడించిన సంస్థలను పక్కనబెట్టి ఈ సంస్థను భుజానికెత్తుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
 
పలు సంస్థలు పోటీ పడ్డా...

 జలమండలి పరిధిలో మొత్తం 8.05 లక్షల కుళాయిలున్నాయి. వీటిలో 1318 బల్క్ కుళాయిలున్నాయి. వీటికి సంబంధించి రోజువారీగా బోర్డు సరఫరా చేస్తున్న నీటిని జీఎస్‌ఎం టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఆటోమేటిక్ మీటర్ రీడర్ల (ఏఎంఆర్)తో పక్కాగా లెక్కించే నీటి మీటర్లు ఏర్పాటు చేయాలని గతేడాది జూన్ 29న మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది. దీని ప్రకారం జలమండలి టెండర్ల ప్రక్రియను గతేడాది నవంబరు నెలలో పూర్తిచేసింది. ఇందులో నగరానికి చెందిన మ్యాన్‌టెక్ సంస్థ, పుణేకు చెందిన చేతాస్ కంట్రోల్ సిస్టమ్స్ పోటీపడ్డాయి. ఇదే తరుణంలో ముఖ్య నేత సోదరుడు అతిగా జోక్యం చేసుకొని పుణేకు చెందిన చేతాస్ కంట్రోల్ సిస్టమ్‌కు టెండరు దక్కేలా చక్రం తిప్పారు.

ఈ కంపెనీకే టెండరు కట్టబెట్టాలని తీవ్రస్థాయిలో ఆయన వాటర్‌బోర్డు అధికారులపై ఒత్తిడి చేసినట్లు తాజాగా తెలిసింది. ఈ బాగోతంలో ఆయనకు బాగానే గిట్టుబాటయినట్లు సమాచారం. ఆయన జోక్యం, ఒత్తిడి కారణంగా జలమండలి వర్గాలూ దీనిపై పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. అంతేకాదు ఇటీవలే మీటర్ల ఏర్పాటు ప్రక్రియను మొదలెట్టింది. ఈ నెలాఖరులోగా 1318 కుళాయిలకు ఈ మీటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

సప‘రేటు’..
 
బడా కుళాయిల(25ఎంఎం)కు ఏర్పాటు చేయనున్న ఏఎంఆర్ నీటి మీటర్లు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై మెట్రో నగరాల్లో రూ.25 వేల లోపుగానే లభ్యమౌతున్నాయి. కానీ ఈ కంపెనీ నగరంలో ఏర్పాటు చేస్తున్న మీటర్ల ధరలు రూ.60 నుంచి రూ.90 వేలు పలకడం గమనార్హం.
 
మీటర్లకు వ్యయం ఇలా..
 
ఈ మీటర్ల ఏర్పాటుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూ.4.43 కోట్లు కేటాయించనుంది. మరో రూ.2.57 కోట్లను మీటర్ల కోసమని జలమండలి వినియోగదారుల నుంచి వసూలు చేసింది. మరో రూ.5.58 కోట్లు జలమండలి వ్యయం చేయనుంది. అంటే 1318 బల్క్ కుళాయిలకు ఏఎంఆర్ నీటి మీటర్ల ఏర్పాటుకు రూ.12.58 కోట్లు వ్యయం కానుంది. ఈ మొత్తాన్ని సదరు కంపెనీ తెలివిగా తన ఖాతాలో వేసుకుంటుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఈ బాగోతంపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలని బోర్డు కార్మికసంఘాలు కోరుతున్నాయి.
 
  ఇదీ లెక్క...
 ఏఎంఆర్ మీటర్లకు చేయనున్న వ్యయం : రూ.12.58 కోట్లు
 గ్రేటర్ పరిధిలో మొత్తం కుళాయిలు: 8.05 లక్షలు
 గ్రేటర్ పరిధిలో బడా కుళాయిలు: 1318
 ఒక్కో ఏఎంఆర్ మీటరు ధర: రూ.60 వేలు-రూ.90 వేలు
 మెట్రో నగరాల్లో ఏఎంఆర్ మీటర్ల ధర: రూ.25 వేలు
 

మరిన్ని వార్తలు