‘భగీరథ’కు తక్కువ వడ్డీ రుణాలు: ఎస్పీ సింగ్

21 Aug, 2016 01:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం తక్కువ వడ్డీకే రుణాలిచ్చేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముందుకు రావడం శుభపరిణామమని పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్నారు. శనివారం బ్యాంకుల ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలో కొన్ని జాతీయ బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి రూ.6,500 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించగా, తాజాగా మరికొన్ని వాణిజ్య బ్యాంకులు రూ.3,200 కోట్లు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని పేర్కొన్నారు.

కెనరా బ్యాంక్ రూ. 2వేల కోట్లు, విజయా బ్యాంక్, ఎస్‌బీహెచ్ బ్యాంకులు రూ.600 కోట్ల చొప్పున రుణమిచ్చే విషయమై ప్రాథమికంగా అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు. ఆయా బ్యాంకులిచ్చిన రుణాలను సెగ్మెంట్ల వారీగా ఖర్చు చేస్తామని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించాక సెగ్మెంట్లకు ఇవ్వాల్సిన రుణాల విషయమై బ్యాంకులు నిర్ణయం తీసుకోనున్నాయని పేర్కొన్నారు. సమీక్షలో ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్, పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రెటరీ, శ్రీధర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు