రబీలో మురిపించిన వరి

4 Mar, 2017 03:12 IST|Sakshi
రబీలో మురిపించిన వరి
  • గతేడాది కంటే 13.73 లక్షల ఎకరాలు అధికం
  • వ్యవసాయశాఖ నివేదిక వెల్లడి... ముగిసిన రబీ సాగు
  • సాక్షి, హైదరాబాద్‌ : ఈసారి రబీలో వరి సాగు విస్తీర్ణం అంచనాలకు మించి పెరిగింది. దీనికి గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన కుండపోత వర్షాల కారణంగా భూగర్భ జలాలు పెరగడమే కారణం. ఈ రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 30.22 లక్షల ఎకరాలు కాగా... 35.47 లక్షల (117%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయని రాష్ట్ర వ్యవసాయశాఖ తన నివేదికలో పేర్కొంది.  గత రబీలో 17.05 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. అంటే గతేడాది కంటే 18.42 లక్షల ఎకరాల్లో అదనంగా పంటలు సాగు కావడం గమనార్హం. అందులో ఆహారధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం 21.90 లక్షల ఎకరాలు కాగా... ఇప్పటివరకు 29.07 లక్షల (133%) ఎక రాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. ఇక  వరిసాగు మాత్రం ఇటీవల ఎన్నడూ లేనంత ఎక్కువగా సాగవడం గమనార్హం. రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 13.32 లక్షల ఎకరాలు కాగా 19.30 లక్షల (145%) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. గతేడాది రబీలో కేవలం 5.57 లక్షల ఎకరాల్లోనే వరినాట్లు పడ్డాయి.

    గతేడాదితో పోలిస్తే ఏకంగా 13.73 లక్షల ఎకరాల్లో అధికంగా వరినాట్లు పడటం గమనార్హం. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.17 లక్షల ఎకరాలు కాగా  ఇప్పటి వరకు 4.65 లక్షల (147%) ఎకరాల్లో పంటలు వేశారు. వేరుశనగ సాధారణంగా 3.80 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, అంతే సాగు జరిగింది. మిరప సాగు కూడా సాధారణంతో పోలిస్తే 121 శాతం అయింది. మిరప సాధారణ సాగు విస్తీర్ణం 50 వేల ఎకరాలు కాగా... 60 వేల ఎకరాల్లో సాగైంది. అయితే, ఉల్లిగడ్డ సాగు సగానికి పడిపోయింది. సాధారణ ఉల్లిసాగు విస్తీర్ణం 25 వేల ఎకరాలు కాగా... 12 వేల ఎకరాలకే పరిమితమైంది.

    ఆదిలాబాద్‌లో అధికంగా సాగు: రబీలో ఆదిలాబాద్‌లో అధికంగా పంటలు సాగయ్యాయి. సాధారణంతో పోలిస్తే ఏకంగా 168 శాతం విస్తీర్ణంలో అన్ని పంటలూ సాగయ్యాయి. ఆ జిల్లాలో రబీలో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 39,377 ఎకరాలు కాగా... 66,242 ఎకరాల్లో  సాగయ్యాయి. వంద శాతానికి మించి పంటలు సాగైన జిల్లాలు 22 ఉండటం గమనార్హం. మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యంత తక్కువగా 54 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. ఆ జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 1.50 లక్షల ఎకరాలు కాగా... 81,900 ఎకరాల్లోనే సాగవడం గమనార్హం. ఇక ఈశాన్య రుతుపవనాలు ఈసారి నిరాశపరిచాయి. మొత్తంగా 45 శాతం లోటు వర్షపాతం రికార్డు అయింది. అక్టోబర్‌లో 30 శాతం, నవంబర్‌లో 96 శాతం, డిసెంబర్‌లో 95 శాతం లోటు వర్షపాతం నమోదైంది.

>
మరిన్ని వార్తలు