ప్రభుత్వ కాలేజీలే ఫస్ట్!

23 Apr, 2016 04:39 IST|Sakshi
ప్రభుత్వ కాలేజీలే ఫస్ట్!

► ఇంటర్ సెకండియర్‌లో 66 శాతం ఉత్తీర్ణత  ప్రైవేటు కాలేజీల్లో 63 శాతం ఉత్తీర్ణత
► ఫస్ట్, సెకండియర్‌లో ఎప్పట్లాగే ఈసారి బాలికల హవా
► బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతమే ఎక్కువ.. ఏకంగా 10 శాతం తేడా
► మొత్తమ్మీద ఫస్టియర్‌లో 53.55 శాతం, సెకండియర్‌లో 62.95 శాతం ఉత్తీర్ణత
► ఫలితాల్లో రంగారెడ్డి ఫస్ట్.. నల్లగొండ లాస్ట్
► విడుదలైన ఇంటర్ ఫలితాలు.. ఈ నెల 26 నాటికి మెమోలు

 
సాక్షి, హైదరాబాద్:
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలు దుమ్మురేపాయి! ప్రైవేటు కాలేజీల కన్నా ఎక్కువ ఉత్తీర్ణత సాధించాయి. ప్రైవేటు కాలేజీలు 63 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ప్రభుత్వ కళాశాలలు 66 శాతం ఉత్తీర్ణత సాధించాయి. శుక్రవారం ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయ ఆవరణలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేయడం విశేషం. ప్రథమ సంవత్సరంలో మాత్రం ప్రైవేటు కాలేజీలే ముందున్నాయి. ఆ కాలేజీల ఉత్తీర్ణత 55 శాతం ఉండగా.. ప్రభుత్వ కాలేజీలు 45 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మొత్తంగా ద్వితీయ సంవత్సరంలో 62.95 శాతం మంది ఉత్తీర్ణులు కాగా... ప్రథమ సంవత్సరంలో 54 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఎప్పట్లాగే ఈసారి కూడా బాలికలే అత్యధికంగా పాసయ్యారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో బాలుర కంటే బాలికలే అధిక ఉత్తీర్ణత శాతంతో టాప్‌గా నిలిచారు.
 
ప్రథమ సంవత్సరంలో..: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం జనరల్‌లో 4,20,180 మంది పరీక్షలకు హాజరు కాగా 2,25,033 మంది(53.55 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 2,14,191 మంది పరీక్షలు రాయగా.. 1,26,116 మంది (58.9 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 2,05,989 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 98,917 మంది (48 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్‌లో 36,495 మంది పరీక్షలకు హాజరు కాగా 18,470 మంది (50.6 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

ద్వితీయ సంవత్సరంలో: సెకండియర్ జనరల్ పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 3,89,883 మంది పరీక్షలకు హాజరు కాగా 2,45,469 మంది (62.95 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 1,98,266 మంది పరీక్షలకు హాజరు కాగా 1,34,111 మంది (67.64 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,91,,617 మంది పరీక్షలకు హాజరు కాగా 1,11,358 మంది (58.11 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక  ప్రైవేటు విద్యార్థులు 84,016 మంది పరీక్షలకు హాజరు కాగా.. 22,436 మంది (26.7 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 28,348 మంది పరీక్షలకు హాజరు కాగా 16,776 మంది (59.17 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్‌లో 4,7,87 మంది
ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాయగా 2,194 మంది ఉత్తీర్ణులయ్యారు.
 
రెండింటా రంగారెడ్డి టాప్

ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా టాప్‌గా నిలిచింది. సెకండియర్ ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో ఈ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా... 65 శాతం ఉత్తీర్ణతతో ఖమ్మం రెండో స్థానంలో నిలిచింది. 53 శాతంతో మెదక్, నల్లగొండ చివరి స్థానాల్లో నిలిచాయి. ప్రథమ సంవత్సరంలో 69 శాతంతో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలువగా, 56 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. 41 శాతం ఉత్తీర్ణతతో నల్లగొండ చివరి స్థానంలో ఉంది.
 
ఈ నెల 26 నాటికి మార్కుల మెమోలు
మార్కుల మెమోలను ఈ నెల 26 నుంచి సంబంధిత రీజనల్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్ల (ఆర్‌ఐవో) నుంచి పొందవచ్చు. మూడు రోజుల్లో మార్కుల రిజిస్టర్లను ఆర్‌ఐవోలకు పంపిస్తారు. అలాగే మార్కుల జాబితాలను ఆర్‌ఐవోల నుంచి సంబంధిత ప్రిన్సిపల్స్ తీసుకెళ్లవచ్చు. వీలైనంత త్వరగా వాటిని విద్యార్థులకు అందజేయాలి. మార్కుల మెమోల్లో ఏమైనా పొరపాట్లు వస్తే మే 23 లోగా సంబంధిత ప్రిన్సిపల్స్ ద్వారా విద్యార్థులు ఇంటర్మీడియెట్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలి.

 ప్రథమ సంవత్సర జనరల్ విద్యార్థుల్లో వివిధ గ్రేడ్‌లలో ఉత్తీర్ణులు ఇలా..
 ‘ఎ’ గ్రేడ్‌లో: 1,10,242 (48.98 శాతం)
 ‘బి’ గ్రేడ్‌లో: 67,150 (29.84 శాతం)
 ‘సి’ గ్రేడ్‌లో: 32,208 (14.31 శాతం)
 ‘డి’ గ్రేడ్‌లో: 15,433 (6.85 శాతం)
 ద్వితీయ సంవత్సర జనరల్ విద్యార్థుల్లో వివిధ గ్రేడ్‌లలో ఉత్తీర్ణులు ఇలా..
 ‘ఎ’ గ్రేడ్‌లో: 1,29,636 (52.81 శాతం)
 ‘బి’ గ్రేడ్‌లో: 73,818 (30.07 శాతం)
 ‘సి’ గ్రేడ్‌లో: 31,496 (12.83 శాతం)
 ‘డి’ గ్రేడ్‌లో: 10,519 (4.28 శాతం)

సెకండియర్‌లో ఏటేటా పెరుగుతున్న ఉత్తీర్ణత
గతంతో పోలిస్తే ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఏటేటా ఉత్తీర్ణత శాతం క్రమంగా పెరుగుతోంది. గత నాలుగేళ్లుగా ఉత్తీర్ణత తీరు ఇలా ఉంది.
జనరల్‌లో సెకండియర్ రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత..
 సంవత్సరం     హాజరైంది        ఉత్తీర్ణులు        ఉత్తీర్ణత శాతం
 2013        3,88,619        2,32,994        59.95
 2014        3,95,949        2,38,133        60.14
 2015        3,78,973        2,32,742        61.41
 2016        3,89,883        2,45,469        62.95

ప్రథమ సంవత్సరంలో తగ్గిన ఉత్తీర్ణత
ప్రథమ సంవత్సరంలో గతేడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. గతేడాది 55.62 శాతం ఉండగా ఈసారి అది 53.55 శాతానికి పడిపోయింది.
గత నాలుగేళ్లుగా ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత..
 సంవత్సరం    పరీక్ష రాసింది    పాసైంది    శాతం
 2013        4,37,248        2,19,679    50.24
 2014        4,15,026        2,18,549    52.65
 2015        4,31,363        2,39,954    55.62
 2016        4,20,180        2,25,033    53.55
 

మరిన్ని వార్తలు