ఇక జీవితాంతం స్టేట్‌హోమ్‌లోనే..

11 Aug, 2016 00:47 IST|Sakshi
ఇక జీవితాంతం స్టేట్‌హోమ్‌లోనే..

వీణావాణీల భవిష్యత్తుపై  సర్కార్ నిర్ణయం
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అనుమతికి వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదన
వారి చదువు, భద్రత, వైద్యం, ఇతరత్రా బాధ్యత ప్రభుత్వానిదే


హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణీలను జీవితాంతం స్టేట్‌హోమ్‌లో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ఉంచేందుకు అనుమతి కోరుతూ స్త్రీ, శిశు సంక్షేమశాఖకు.. వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదన పంపాలని నిర్ణయించింది. వారు టీనేజీలోకి అడుగుపెట్టినందున భద్రత, చదువు, వైద్య వసతి, ఇతరత్రా అన్ని సదుపాయాలు ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అందువల్ల స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు సమగ్రమైన ప్రతిపాదనలతో నివేదిక తయారుచేసి అనుమతి తీసుకోనున్నారు. అక్కడి నుంచి అంగీకారం రాగానే వారిని స్టేట్‌హోమ్‌కు తరలిస్తారు. పేదరికం కారణంగా వీణావాణీలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాసక్తత కనబరిచిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అవిభక్త కవలలుగా ఉన్న వారికి సంబంధించిన అంశాన్ని ప్రత్యేక అంశంగా పరిగణించి చివరకు స్టేట్‌హోమ్‌కి తరలిస్తేనే మంచిదని సర్కారు భావించింది.


శస్త్రచికిత్సపై ఆశ ల్లేవ్..
అవిభక్త కవలలైన వీరిని విడదీసి విముక్తి కల్పించాలని ప్రభుత్వం భావించినా అది నెరవేరే పరిస్థితి కనిపించడంలేదు. లండన్ డాక్టర్లు పరిశీలించి వెళ్లారు. వారు సరేనన్నా.. రిస్క్ ఉంటుందన్నారు. ఈ విషయంపై ఎయిమ్స్ వైద్యులు కూడా రిస్క్ తప్పదని స్పష్టంచేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా డాక్టర్లు కూడా ముందుకు వచ్చారు. కానీ రిస్క్ ఉంటుందన్న వైద్య నిపుణుల అభిప్రాయం వ్యక్తం కావడంతో శస్త్రచికిత్సకు వెళ్లడానికి సర్కారు ఏమాత్రం సుముఖంగా లేదు. శస్త్రచికిత్స చేస్తే అవిభక్త కవలల్లో ఎవరికి ప్రాణాపాయం ఉన్నా అది ఆమోదయోగ్యం కాదని... అలాంటి రిస్క్ భరించడానికి ప్రభుత్వ వర్గాలు, తల్లిదండ్రులు సిద్ధంగా లేరని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు.


ఎన్ని కోట్లైనా సర్కారు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని... కానీ రిస్క్ ఉంటే మాత్రం ముందుకు వెళ్లబోమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి జీవితాంతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామంటున్నారు. స్టేట్‌హోమ్‌కు తరలిస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రత్యేకంగా మార్గదర్శకాలు ఖరారు చేస్తామని... ఆ ప్రకారం వారు నడుచుకోవాల్సి ఉంటుందంటున్నారు.

 

మరిన్ని వార్తలు