‘అరుణాచల్‌’ కథ కంచికి!

25 Jan, 2018 02:20 IST|Sakshi
నగరంలో తిరుగుతున్న అరుణాచల్‌ప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌ బస్సు

నిబంధనలు పాటించకున్నా ప్రైవేటు బస్సులకు పచ్చజెండా 

మొన్నటి వరకు జప్తు చేసి.. ఇప్పుడు అనుమతినిచ్చిన ప్రభుత్వం 

వాటి నిషేధం సమయంలో కళకళలాడిన ఆర్టీసీ సర్వీసులు 

సాక్షి, హైదరాబాద్‌: నిబంధనలు మారలేదు.. బస్సుల యజమానులూ పద్ధతి మార్చుకోలేదు.  కొన్ని నెలల క్రితం ప్రభుత్వానికి అక్రమంగా కనిపించిన తీరు ఇప్పు డు ఉన్నట్టుండి సక్రమమైంది. గత జూన్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌తో ఉన్న బస్సులపై ఆ రాష్ట్రం కన్నెర్ర చేసిన నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ కూడా అలాంటి బస్సులపై కొరడా ఝళిపించింది. కానీ ఆరు నెలలు తిరక్కుండానే రవాణా శాఖ ఆ హెచ్చరికలను ‘తాటాకు చప్పుళ్లు’ చేసి ఆ బస్సులకు లైన్‌ క్లియర్‌ చేసింది. వెరసి ఆర్టీసీ దివాలా దశకు చేరటానికి కారణంగా మారిన ప్రైవేటు బస్సులను నియంత్రించటం అసాధ్యమని మరోసారి నిరూపించింది. నిబంధనలతోపాటు భద్రత ప్రమాణాలను కూడా ప్రైవేటు బస్సులు పాటించటం లేదని ఆరోపించే రవాణా శాఖ.. ఇప్పుడు వాటికి అనుకూలంగా వ్యవహరించటం చర్చనీయాంశంగా మారింది. 

జరిగింది ఇదీ! 
గత జూన్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రైవేటు బస్సులపై విరుచుకుపడింది. అక్కడి చిరునామాలతో అక్కడే బస్సులను రిజిస్టర్‌ చేసి, అక్కడే పర్మిట్‌లు పొంది వేరే ప్రాంతాల్లో తిరగటం అక్రమమని గుర్తించి వాటి అనుమతులు రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అలాం టి బస్సులు దాదాపు వెయ్యి వరకు ఉండటంతో ఇక్కడా వాటిని నియంత్రించారు. తెలంగాణ ప్రభుత్వం ఆ బస్సులను గుర్తించి వాటి నుంచి త్రైమాసిక పన్ను వసూలును నిలిపివేసింది. వాటికి అనుమతి లేనందున రోడ్డెక్కితే జప్తు చేయాలని ఆదేశించింది. దీంతో రవాణా శాఖ అధికారులు ఆ బస్సులు ఎక్కడ కనిపిస్తే అక్కడ జప్తు ప్రారంభించారు. దీంతో ఆర్టీసీ బస్సులు కళకళలాడాయి. రద్దీ ఉన్న చోట్ల అదనపు బస్సులు తిప్పడాన్ని ఆర్టీసీ మొదలుపెట్టింది. ఇంతలో కొందరు దళా రులు ఆ బస్సులపై నిషేధం ఎత్తేయాలని రవాణా శాఖపై ఒత్తిడి ప్రారంభించారు. ఆ ఒత్తిడే పని చేసిందో, త్రైమాసిక పన్ను రూపంలో ఆదాయం కోల్పో వటం ఎందుకని అనుకున్నారో తెలియదు గాని సంక్రాంతి సమయంలో వాటికి పచ్చజెండా ఊపేశారు. 

రూ.5.5 లక్షల ఆదాయం 
ప్రతి ప్రైవేటు బస్సు మూడు నెలలకోసారి సీటుకు రూ.3,500 చొప్పున ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. వెరసి ఒక్కో బస్సు నుంచి ఏడాదికి రూ.ఐదున్నర లక్షల వరకు పన్ను వసూలవుతుంది. 

సీన్‌ రివర్స్‌! 
బెంగళూరు సహా విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుండటంతో హైదరాబాద్‌ నగరంలోని బీహెచ్‌ఈఎల్, మియాపూర్, కూకట్‌పల్లి.. తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ఏసీ బస్సులు నడుపుతోంది. బీహెచ్‌ఈఎల్, మియాపూర్, హైదరాబాద్‌–3 డిపోలకు సంబంధించి 20 గరుడ ప్లస్, 20 రాజధాని ఏసీ బస్సులు నడుస్తున్నాయి. ప్రైవేటు బస్సులపై నిషేధం ఉన్న సమయంలో ఈ బస్సుల్లో సీట్లు సరిపోక అదనపు బస్సులు నడపాల్సి వచ్చింది. ఫలితంగా ఆర్టీసీ గల్లా పెట్టె కళకళలాడింది. ప్రైవేటు బస్సులపై నిషేధం తొలగ్గానే ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో సగటున 45 శాతానికి పడిపోయింది. పగటి పూట నడిచే రాజధాని బస్సుల్లో ఇది 70 శాతం వరకు ఉండగా, గరుడ బస్సుల్లో పరిస్థితి దారుణంగా పడిపోయింది. రాత్రి వేళ ప్రైవేటు బస్సులు స్లీపర్‌ సర్వీసులు నడుపుతుండటంతో జనం అటువైపు మొగ్గు చూపుతున్నారు. విషయాన్ని డిపో మేనేజర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ప్రైవేటు బస్సుల నియంత్రణ తమ చేతుల్లో లేకపోవటంతో వారు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. 

ఏపీ చర్యలతో గండి..? 
నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఈ బస్సులు ఏపీ కేంద్రంగానే ఎక్కువగా ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌ ఉదంతం సమయంలో వాటిని నియంత్రించారు. కానీ రెండుమూడు నెలలకే అనుమతించేశారు. దీంతో ఏపీ నుంచి హైదరాబాద్‌కు ఎక్కువ బస్సులు తిరగటం మొదలుపెట్టాయి. ఇక్కడ నిషేధం ఉండటంతో అధికారులు వాటిని జప్తు చేయటం గందరగోళంగా మారింది. ఎలాగూ ఏపీ గేట్లు ఎత్తేసింది కాబట్టి ఇక్కడా నిషేధం తొలగించి పన్ను వసూలు చేసుకోవటం మంచిదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొందరు అధికారులు చెబుతున్నారు. 

నిబంధనల ఉల్లంఘన ఇలా.. 
- కేంద్ర మోటారు వాహనాల చట్టం 1989 నిబంధన 128(10) ప్రకారం జాతీయ పర్మిట్‌ ఉన్న రవాణా వాహనాల్లో బెర్తులు ఏర్పాటు చేయొద్దు. కానీ రాష్ట్రంలో తిరుగుతున్న ప్రైవేటు బస్సుల్లో ఉంటున్నాయి.  
నిబంధన 125(4) సి, ప్రకారం ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలు, రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి పర్మిట్లు పొందిన ప్రైవేటు బస్సులు మాత్రమే బెర్తులు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ వేర్వేరు రాష్ట్రాల పర్మిట్‌ పొంది రాష్ట్రాల మధ్య తిరుగుతున్నాయి.
తెలంగాణ మోటారు వాహనాల చట్టం నిబంధన 297(ఎ) ప్రకారం ఆర్టీసీ మినహా మరే బస్సులు స్టేజీ క్యారియర్లుగా తిరగొద్దు. ప్రైవేటు సంస్థలు బోర్డులు పెట్టి మరీ టికెట్లు అమ్ముకుంటున్నాయి.  

మరిన్ని వార్తలు