బీటీ పత్తి విత్తనాల కేసులో సర్కార్‌కు ఊరట..

21 Apr, 2016 04:10 IST|Sakshi
సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు స్టే

సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు స్టే
 
సాక్షి, హైదరాబాద్:
బీటీ పత్తి విత్తనాల రాయల్టీ నిర్ణయం విషయంలో తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. బీటీ విత్తనాల ప్యాకెట్‌కు రూ.50ని రాయల్టీగా నిర్ణయిస్తూ తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వును నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ధర్మాసనం స్టే విధించింది. తదుపరి విచారణను జూన్ 14కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తేల్చిచెప్పింది. మహికో మోన్‌శాంటో, విత్తన కంపెనీల మధ్య నడుస్తున్న వివాదానికి సంబంధించి మధ్యవర్తి వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై ఈ మధ్యంతర ఉత్తర్వులు ఏ విధమైన ప్రభావం చూపబోవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మహికో మోన్‌శాంటో బీటీ పత్తి విత్తనాల రాయల్టీని ప్యాకెట్‌కు రూ.50గా ఖరారు చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మోన్‌శాంటో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన సింగిల్ జడ్జి, ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బు ధవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, విత్తన కంపెనీల త రఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, ఎస్ .నిరంజన్‌రెడ్డిలు వాదనలు వినిపించారు.

మరిన్ని వార్తలు