ఐటీఐలపై నీతి ఆయోగ్ అధ్యయనం

10 Jun, 2016 04:27 IST|Sakshi
ఐటీఐలపై నీతి ఆయోగ్ అధ్యయనం

13న రాష్ట్రంలో పర్యటన
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఐటీఐల పనితీరును పరిశీలించేందుకు నీతి ఆయోగ్ బృందం ఈనెల 13న రాష్ట్రంలో పర్యటించనుంది. హైదరాబాద్‌లోని సనత్‌నగర్, మల్లేపల్లి ఐటీఐలను పరిశీలించనుంది. ఐటీఐల నిర్వహణలో సమూలమైన మార్పులు తీసుకురావటంతో పాటు ప్రైవేట్ ఐటీఐల ఆగడాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఈ అధ్యయనం చేస్తోంది. అలాగే వొకేషనల్ ట్రైనింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు (వీటీఐపీ) పేరిట కేంద్ర ప్రభుత్వం ఐటీఐలకు మంజూరు చేసిన నిధుల వినియోగం, ప్రాజెక్టు ఫలితాలు, వైఫల్యాలను తెలుసుకోనుంది.

రాష్ట్రంలోని 60 ప్రభుత్వ ఐటీఐల్లో 41 కేంద్రాలకు కేంద్రం వీటీఐపీలో భాగంగా రూ.3.50 కోట్లు కేటాయించింది. కేంద్రం 75 శాతం, రాష్ట్రం 25 శాతం ఇవ్వాల్సి ఉంది. గతేడాది 11 కాలేజీలకు కేంద్రం ఈ నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు వాటా విడుదల చేయలేదు. దీంతో ఈ ప్రాజెక్టు అమల్లో ఉన్న ఐటీఐల్లోనూ నిరాశాజనకమైన శిక్షణ, నిర్వహణ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరోవైపు ప్రైవేటు ఐటీఐలు అడ్డగోలు ఫీజులు, సీట్ల అమ్మకంతో చెలరేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసేందుకు నీతి ఆయోగ్ బృందం క్షేత్ర స్థాయి అధ్యయనం చేస్తోందని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య తెలిపారు.

మరిన్ని వార్తలు