పోలీసులకు ఫాస్ట్‌ట్రాక్ పదోన్నతుల విధానం

1 Mar, 2014 00:23 IST|Sakshi

 వెంటనే అమలు చేయాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్
  సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారుల వరకు పదోన్నతులు కల్పించడానికి ఫాస్ట్‌ట్రాక్ పదోన్నతుల విధానాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి డిమాండ్ చేశారు. సంఘానికి చెందిన 57 యూనిట్ల అధ్యక్షులు, కార్యదర్శులు శుక్రవారమిక్కడ సమావేశమై తమ సమస్యలపై చర్చించుకున్నారు. అనంతరం గోపిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరిస్తామని కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారని, కానీ ఆ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు.
 
  ప్రతి కానిస్టేబుల్ సొంత ఇల్లు నిర్మించుకోవడానికి వీలుగా భూమి కేటాయింపు, బస్సుపాస్ సౌకర్యం, ఎస్‌ఐలను గెజిటెడ్ అధికారులుగా గుర్తించడం, కానిస్టేబుళ్లకు జూనియర్ అసిస్టెంట్ హోదా కల్పించడం వంటి ప్రధాన డిమాండ్లు అపరిష్కృతంగా ఉన్నాయని వివరించారు. హోంగార్డులకు ఆరోగ్య భద్రత పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. కాగా, శనివారం హైదరాబాద్‌లోని రోజ్‌గార్డెన్(నాంపల్లి)లో తమ సంఘం విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు