సెక్స్ రాకెట్ కేసును తప్పుదోవ పట్టిస్తారా: వైఎస్ జగన్

17 Dec, 2015 08:55 IST|Sakshi
సెక్స్ రాకెట్ కేసును తప్పుదోవ పట్టిస్తారా: వైఎస్ జగన్

విజయవాడ కేంద్రంగా సాగుతున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా తోటి ఎమ్మెల్యేలందరితో కలిసి ఆయన రవీంద్ర భారతి నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి బయల్దేరారు. దానికి ముందు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే...

''విజయవాడలో హేయమైన కార్యక్రమం చేసి, ఆడాళ్లను ఆట వస్తువులుగా ఉపయోగించుకుని సెక్స్ రాకెట్‌కు పాల్పడితే, అందులో కూడా చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీజీ ఇంటెలిజెన్స్ వెంకటేశ్వరరావు ఇంతమంది కనిపిస్తుంటే దీన్ని దారి మళ్లించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇదేదో వడ్డీ వ్యాపారం అన్నట్లు వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేస్తున్నారు. వందల మందిని అరెస్టు చేస్తారు.. వాళ్లలో కూడా ప్రతిపక్షాల వాల్లే ఎక్కువ ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇంతకంటే దారుణం ఉండదు.

విజయవాడలో సీఎం అండదండలతో, నేరుగా డీజీ ఇంటెలిజెన్స్‌తో నిందితులు చర్చలు జరుపుతున్న ఫొటోలు కూడా ఉండగా, ఎమ్మెల్యే విదేశీ పర్యటనకు వెళ్లడం, ఆయనతోపాటు ఉన్న నిందితుడు మాత్రం తిరిగి రాకపోవడం చూస్తున్నాం. ఎమ్మెల్సీ పదవిలో ఉన్న వ్యక్తి సొంత తమ్మడే ఈ వ్యాపారం చేస్తాడు. 200 పైగా వీడియో టేపులలో అమ్మాయిలను అశ్లీల చిత్రాలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేస్తుంటే, అందులో సీఎం డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ సెక్స్ రాకెట్ నుంచి కేసును తప్పుదోవ పట్టించేందుకు ఇది కేవలం వడ్డీ వ్యాపారంతో సంబంధం ఉన్నట్లు దాడులు చేస్తారు. సాదా సీదా కేసుగా చిత్రీకరించే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. విజయవాడలో బాధితులందరికీ గుంజిళ్లు తీసి, చెంపలు వేసుకుని మరీ క్షమాపణలు చెప్పాలి. అప్పుడు కూడా ప్రజలు వీళ్లను క్షమించే పరిస్థితి లేదు'' అని ఆయన మండిపడ్డారు.

అడ్డుకున్న పోలీసులు
అసెంబ్లీ వద్దకు పాదయాత్రగా చేరుకున్న వైఎస్ జగన్, ఇతర ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులు లోపలకు తీసుకురావద్దంటూ వారికి ఆంక్షలు పెట్టారు. దీంతో వైఎస్ జగన్ మండిపడ్డారు. రాష్ట్రం మొత్తం చంద్రబాబును తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతోందని, అసెంబ్లీ జరిపించుకుంటారా లేదా అన్న విషయాన్ని ఆయనకే వదిలిపెడతామని ఆయన అన్నారు. పోలీసులకు, ప్రతిపక్ష నేతకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చీఫ్ మార్షల్ బయటకు వచ్చి పోలీసులకు నచ్చజెప్పిన తర్వాత అప్పుడు ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీలోకి అనుమతించారు.

మరిన్ని వార్తలు