సుపరిపాలనకు సంకేతం కావాలి

12 Apr, 2015 03:40 IST|Sakshi
సుపరిపాలనకు సంకేతం కావాలి

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై గవర్నర్ ఆకాంక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ముందుకె ళ్లాలన్నా, వెనక్కి పోవాలన్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేతుల్లోనే ఉందని.. అది సుపరిపాలనకు సంకేతంగా నిలవాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. వచ్చే మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వంలో సేవలందించాల్సిన ఉద్యోగుల నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించే బాధ్యత కమిషన్‌పైనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) అధికారిక లోగోను, వెబ్‌సైట్‌ను గవర్నర్ శనివారం  రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు. అలాగే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు ప్రక్రియను ఐటీ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ముందుకె ళ్లాలన్నా, వెనక్కి పోవాలన్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేతుల్లోనే ఉందన్నారు. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో విశ్వసనీయత, పారదర్శకత ముఖ్యమని పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించుకోవడం గర్వకారణమని, సుపరిపాలన కు ఇది సంకేతం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు.

వెబ్‌సైట్లో ‘వన్‌టైమ్ రిజిస్ట్రేషన్’ వంటి కొత్త అంశాలను మరిన్ని జోడించాలని సూచించారు. రాష్ట్ర కేడర్ తప్ప మిగతా ఉద్యోగాల భర్తీకి కమల్‌నాథన్ కమిటీతో పనిలేదన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం తెలంగాణ యువత ఎదురు చూస్తున్నందున, త్వరగా నియామకాల ప్రక్రియలను చేపట్టాలని సూచించారు.
 
ఆకాంక్షలకు అనుగుణంగా..
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వివక్షకు లోనైన లక్షలాది మంది తెలంగాణ యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే ఉద్యోగాల భర్తీలో జరిగిన జాప్యంపై నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్నారు. సుమారు 628 ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసే బాధ్యతను త్వరలోనే టీఎస్‌పీఎస్సీకి అప్పగించనున్నట్లు మంత్రి తెలిపారు.
 
త్వరలో ఇంజనీర్ పోస్టుల భర్తీ..
ఉద్యోగ నియామకాల తొలి నోటిఫికేషన్‌ను ఈ నెలాఖరులోగా ఇవ్వనున్నట్లు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. పంచాయతీరాజ్‌తో పాటు ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల విభాగాల్లో సుమారు రెండువేల సివిల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిందని చెప్పారు. 14న ఐఏఎస్ ప్రొహిబిషనరీ అధికారుల పరీక్షలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఐటీశాఖ  కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, సమాచార శాఖ కార్యద ర్శి ఆర్వీ చంద్రవదన్, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్, సభ్యుడు విఠల్, లోగో రూపకర్తలు అలయ్ లక్ష్మణ్ , రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
 
ఒకసారి దరఖాస్తు చేసుకుంటే చాలు..
అభ్యర్థి ప్రతి నోటిఫికేషన్‌కు దరఖా స్తు చేసుకునే అవసరం లేకుండా ‘వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ’ సౌకర్యాన్ని టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేశారు. అభ్యర్థుల అర్హతలను బట్టి నోటిఫికేషన్ వివరాలను ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా టీఎస్‌పీఎస్సీ చేరవేస్తుంది.
వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా అభ్యర్థి వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. ఆన్‌లైన్‌లోనే విద్యార్హతల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేస్తారు.
దీని ద్వారా తప్పుడు సమాచారానికి ఆస్కారం ఉండదు. డూప్లికేషన్ బెడద తప్పుతుంది.

మరిన్ని వార్తలు