సినారే మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

12 Jun, 2017 18:09 IST|Sakshi
హైదరాబాద్‌: ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆకస్మిక మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌ నరసింహన్‌ సినారే మృతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 'ఇలాంటి సమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. ఆయన రాసిన విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ్‌ అవార్డు రావడం తెలుగు జాతికి గర్వకారణం' అని  అన్నారు.
 
సినారె మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సాహిత్య రంగంలో సినారె కృషి ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. అధ్యాపకుడు, సాహితీవేత్త, కవి, సినీ గేయ రచయితగా సినారె ఎనలేని కృషి చేశారన్నారు.
 
సినారె సేవలు మరువలేనివి
సి.నారాయణరెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహిత్య రంగానికి సినారె చేసిన ఎనలేనివన్నారు. ఎన్టీఆర్‌తో సినారె ఎంతో సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. రచయితగా, రాజ్యసభ సభ్యుడిగా సినారె చేసిన సేవలు చరిత్రలో మిగిలిపోతాయన్నారు.  సి.నారాయణరెడ్డి మృతిపట్ల ఏపీ మంత్రులు లోకేశ్‌, చినరాజప్ప, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ తదితరులు సంతాపం ప్రకటించారు.
మరిన్ని వార్తలు