’సరస్వతిని లక్ష్మిగా మారుస్తున్నారు’

2 Sep, 2016 16:19 IST|Sakshi
గవర్నర్ నరసింహన్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని, చదువుల తల్లి సరస్వతిని లక్ష్మిగా మారుస్తున్నారని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు.  తెలంగాణ ఏర్పడి రెండేళ్లు గడిచిందని, ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీడ్ పెంచాలని నరసింహన్ సూచించారు. ప్రజాప్రతినిధులు ఒకసారి విద్యా వ్యవస్థపై దృష్టి సారించాలన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్య వ్యాపారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యలో స్కిల్ డెవలప్‌మెంట్ భాగంగా ఉండాలని చెప్పారు. ఇంజినీరింగ్ పాసైన వ్యక్తి అటెండర్ ఉద్యోగం చేయడం కన్నా దురదృష్టకరం మరొకటి ఉండదన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ లేకపోతే మేకిన్ ఇండియా తయారు కాదని, జాగృతి సంస్థ సమాజం మొత్తాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ జాగృతి  స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నగరంలోని అశోక్‌నగర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని కేంద్ర మంత్రి రాజీవ్‌ ప్రతాప్ రూడీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ప్రారంభించారు.

మరిన్ని వార్తలు