కామన్‌ మ్యాన్‌లా ఆస్పత్రికి..

24 Aug, 2017 00:13 IST|Sakshi
కామన్‌ మ్యాన్‌లా ఆస్పత్రికి..
‘గాంధీ’కి వచ్చిన గవర్నర్‌
- కాలి మడమ ఆనెతో ఇబ్బంది పడుతున్న నరసింహన్‌
చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమన్న వైద్యులు.. 
తర్వాత చేయించుకుంటానన్న గవర్నర్‌  
 
సాక్షి, హైదరాబాద్‌:  ప్రభుత్వాస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ఎన్‌ నరసింహన్‌ బుధవారం గాంధీ జనరల్‌ ఆస్పత్రికి ఓ సాధారణ రోగిలా వచ్చారు. ఆయన కుడికాలి మడమ వద్ద ఆనె ఏర్పడింది. నడిచే సమయంలో నొప్పి రావడంతో చికిత్స కోసం ఎలాంటి హడావుడి లేకుండా మధ్యాహ్నం 12 గంటలకు ఆస్పత్రికి వచ్చారు. ఇటీవల ఆస్పత్రిలో 65 పడకల ఆధునిక ఐసీయూను ప్రారంభించి, ఇకపై తాను కూడా గాంధీలోనే వైద్య చికిత్స చేయించుకుంటానని గవర్నర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రవణ్‌ కుమార్‌ ఆయన్ను ఇన్‌పేషెంట్‌ విభాగం ఐదో అంతస్తులోని చర్మవ్యాధుల విభాగానికి తీసుకువెళ్లారు.

చర్మవ్యాధి నిపుణులు వైద్యపరీక్షలు చేసి ప్లాస్టిక్‌ సర్జరీ విభాగ వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు. ఆ విభాగాధిపతి ప్రొఫెసర్‌ సుబోధ్‌ కుమార్‌ ఆపరేషన్‌ థియేటర్‌లో ఉండటంతో ఆయన వచ్చే వరకు వేచి ఉన్నారు. ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్న ఆయన్ను పిలిచేందుకు వైద్యులు యత్నించగా గవర్నర్‌ వారిని వారించారు. అనంతరం అక్కడకు చేరుకున్న డాక్టర్‌ సుబోధ్‌ కుమార్, జనరల్‌ సర్జరీ విభాగాధిపతి ఎన్‌వీఎన్‌రెడ్డి గవర్నర్‌ కాలి మడమను పరీక్షించారు.

నొప్పికి మడమ పైభాగంలో ఏర్పడిన ఆనె కారణమని గుర్తించారు. చిన్నపాటి సర్జరీ చేసి దాన్ని తొలగించాలని, సర్జరీ తర్వాత రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. అయితే, ప్రస్తుతం తనకు బిజీ షెడ్యూల్‌ ఉందని, వీలు చూసుకుని మళ్లీ వచ్చి, ఇక్కడే సర్జరీ చేయించుకుంటానని గవర్నర్‌ చెప్పినట్లు తెలిసింది. ఆయన ఆస్పత్రి నుంచి వెళ్లిపోయిన తర్వాత గవర్నర్‌ వ్యక్తిగత వైద్యుడు సూపరింటెండెంట్‌కు ఫోన్‌ చేసి గురువారం తాను స్వయంగా ఆస్పత్రికి వస్తానని, సంబంధిత వైద్యులతో చర్చించిన తర్వాతే సర్జరీ కోసం తేదీని నిర్ణయిద్దామని చెప్పినట్లు సూపరింటెండెంట్‌ తెలిపారు.  
 
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. 
వైద్య పరీక్షల అనంతరం పాలనాయంత్రాంగంతో గవర్నర్‌ మాట్లాడుతూ ‘స్కానింగ్‌ల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది, మరో ఎమ్మారై స్కానింగ్‌ యంత్రం అవసరం ఉందా.. అని ఆరా తీశారు. గతంలోనే ప్రతిపాదనలు పంపామని అధికారులు వివరించారు. స్టాఫ్‌ నర్సులు, పారామెడికల్, ల్యాబ్‌ టెక్నీషియన్లు, వైద్యులు, సిబ్బంది కొరత ఉందని అధికారులు తెలపడంతో ఈ విషయాలను ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానని గవర్నర్‌ హామీనిచ్చారు. నిరుపేదలతోపాటు అన్నివర్గాల వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.