ఫ్రైవేటు విద్యాసంస్థకు కారుచౌకగా భూమి

31 Mar, 2016 23:06 IST|Sakshi

- రూ. 7.14 కోట్ల విలువైన భూమి రూ. 59 లక్షలకే
- తిరుపతి సమీపంలో అనంత ఎడ్యుకేషనల్ సొసైటీకి ధారాదత్తం


సాక్షి, హైదరాబాద్: తిరుపతికి సమీపంలోని ఆర్.అగ్రహారంలో అత్యంత విలువైన, ముఖ్యమైన ప్రాంతంలో 2.38 ఎకరాల భూమిని ప్రయివేటు విద్యా సంస్థకు కారు చౌకగా ప్రభుత్వం ధారాదత్తం చేసింది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని ఆర్. అగ్రహారం ఇటు రేణిగుంట రైల్వే స్టేషన్‌కు, తిరుపతి బస్సుస్టాండుకు, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఎకరా విలువ హీనపక్షం రూ. 3 కోట్లు పైనే ఉంటుంది. ఇంత విలువైన భూమిని అనంత ఎడుకేషనల్ సొసైటీ కరస్పాండెంట్ రవి అనంతకు ఎకరా కేవలం రూ. 25 లక్షల ధరతో 2.38 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. రూ. 7.14 కోట్ల విలువైన 2.38 ఎకరాల భూమిని కేవలం రూ. 59.50 లక్షలకే రవి అనంతకు కట్టబెడుతూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

గత ప్రభుత్వ హయాంలోనే దరఖాస్తు చేసినా..
గత ప్రభుత్వ హయాంలోనే తన విద్యా సంస్థ ఏర్పాటుకోసం భూమి కేటాయించాలని రవి అనంత దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు 2009 జూన్ పదో తేదీన చిత్తూరు జిల్లా నుంచి రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు ప్రతిపాదన వచ్చింది. అయితే గత ప్రభుత్వం ఈ సంస్థకు భూమిని కేటాయించకుండా ఫైలును పక్కన పడేసింది. వ్యాపార దృక్పథంతో విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలు ఫీజులు దండుకుంటున్న ప్రయివేటు విద్యా సంస్థకు ప్రభుత్వ భూమిని కేటాయించాల్సిన అవసరం లేదని అప్పటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 అక్టోబరు 27వ తేదీన రవి అనంత మళ్లీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకున్నారు. దీంతో చకచకా ఫైలు కదిలింది.

విద్యా సంస్థ ఏర్పాటు పేరుతో రవి అనంతకు 2.38 ఎకరాల భూమిని కారు చౌకగా కట్టబెడుతూ రెవెన్యూ శాఖ గురువారం జీవో నంబరు 121 జారీ చేసింది. భారీగా ఫీజులు దండుకుంటున్న ప్రయివేటు విద్యా సంస్థకు కారు చౌకగా ప్రభుత్వ భూమి కేటాయించాల్సిన అవసరం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ‘సేవాభావంతో పనిచేసే సొసైటీలకు నామమాత్రపు ధరతో భూములు ఇవ్వడం సబబే. కానీ వ్యాపార ధోరణితో పనిచేసే విద్యా సంస్థకు ఇలా ఇవ్వడం నిజంగా అన్యాయమే. కోట్లు దండుకునే వారు భూములు కొనుక్కోలేరా? వారికి ప్రభుత్వ భూమి ఎందుకు ఇవ్వాలి?’ అని అధికార వర్గాలు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు