పెరగనున్న ఆల్మట్టి ఎత్తు!

20 Oct, 2016 03:23 IST|Sakshi

519.6 మీటర్ల నుంచి 524.2 మీటర్లకు పెంపు

 సాక్షి, హైదరాబాద్: కృష్ణా నీటి కేటాయింపుల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిన నేపథ్యంలో కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ ఎత్తుపై సందిగ్ధత తొలిగిపోయింది. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాంకు 519.6 మీటర్ల ఎత్తు వరకు అనుమతి ఉంది. సుమారు 129 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 173 టీఎంసీల నీటి  వినియోగానికి వీలుంది. అరుుతే బ్రిజేశ్ తీర్పు అమల్లోకి వస్తే దాని ఎత్తు 524.25 మీటర్ల వరకు పెరగనుంది.

ఆ మేరకు నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగనుంది. దాంతో దిగువనున్న మన రాష్ట్రానికి నీటి విడుదల మరింత ఆలస్యం కానుంది. అలాగే ఆల్మట్టి ద్వారా కర్ణాటక నీటి వాడకం 173 టీఎంసీల నుంచి 303 టీఎంసీలకు పెరగనుంది. ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతివ్వడం వల్ల అదనంగా 130 టీఎంసీల నీటిని వాడుకునే వెసులుబాటు కర్ణాటకకు లభిస్తుంది.

ఇప్పటికే ఆల్మట్టి నుంచి దిగువ శ్రీశైలం, సాగర్‌లకు నీళ్లొచ్చేందుకు సెప్టెంబర్ దాకా ఆగాల్సి వస్తోంది. ఇప్పుడు కర్ణాటక 303 టీఎంసీలు వాడుకుంటే దిగువకు నీరు రావడం కష్టంగా మారుతుంది. ఒకవేళ వచ్చినా అవన్నీ అక్టోబర్ తర్వాతే వచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే సాగర్ కింది ఆయకట్టుకు నీరందించడమే గగనంగా మారే ప్రమాదం ఉంది.

మరిన్ని వార్తలు