ఏ భాయ్‌ జర దేఖ్‌కే చలో..

9 Jan, 2018 02:15 IST|Sakshi

ప్రమాద ప్రాంతాలపై జీపీఎస్‌ అలర్ట్‌ 

నూతన సాఫ్ట్‌వేర్‌కు పోలీస్‌ శాఖ యత్నాలు  

ప్రతి వాహనానికీ ‘విధిగా జీపీఎస్‌’ దిశగా కసరత్తు 

గూగుల్‌కు 600కుపైగా బ్లాక్‌స్పాట్స్‌..  

200 మీటర్ల నుంచే అలారంతో అప్రమత్తం 

సాక్షి, హైదరాబాద్‌: వాట్సాప్‌ మెసేజ్‌ రాగానే మన ఫోన్‌ అప్రమత్తం చేస్తుంది. మెయిల్, ఫేస్‌బుక్‌ పోస్టులు, షేర్, లైకులు వచ్చినా ఫోన్‌లో మెసేజ్‌ టోన్‌ వస్తుంది. వెంటనే ఆ సందేశాన్ని చూసుకుంటాం. మరి ప్రయాణం చేస్తున్నపుడు ప్రమాదకరమైన మూలమలుపో.. ప్రమాద స్థలమో వస్తే? మనకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెబుతారు? ఎలా గుర్తు చేస్తారు? అందుకోసమే ప్రమాద స్థలాలు సమీపిస్తుంటే మనల్ని అప్రమత్తం చేసే కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుంది. సాంకేతికత వినియోగంతో మరో అద్భుతమైన సౌకర్యాన్ని వాహనదారులకు పోలీస్‌ శాఖ అందించబోతోంది.  

అలర్ట్‌ చేసేస్తుంది..
రాష్ట్రంలోని జాతీయ రహదారులపై పదే పదే ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్స్‌గా పోలీస్‌ శాఖ గుర్తించింది. రాష్ట్ర రహదారులు, అర్బన్‌ ప్రాంతాల్లోని రోడ్డు ప్రమాదాల ప్రాంతాలను గుర్తించింది. వీటిలో 2 నుంచి 5 ప్రమాదాలు జరిగిన ప్రతి ప్రాంతాన్ని బ్లాక్‌ స్పాట్‌గా గుర్తించి అధికారులు జీపీఎస్‌ ట్యాగ్‌ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి 150 వరకు బ్లాక్‌ స్పాట్ల ట్యాగింగ్‌ పూర్తయ్యింది. జిల్లాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులపై మొత్తం కలిపి 560 బ్లాక్‌ స్పాట్లను గుర్తించారు. వీటికి కూడా త్వరలోనే జీపీఎస్‌ ట్యాగ్‌ చేసేం దుకు చర్యలు చేపట్టారు. ఈ జీపీఎస్‌ ట్యాగింగ్‌లను గూగుల్‌ సంస్థకు అందించనున్నారు. దీంతో ప్రమాద స్థలానికి 200 మీటర్ల ముందే జీపీఎస్‌ ద్వారా అలర్ట్‌ మెసేజ్‌ వచ్చేలా చూడాలని భావిస్తున్నారు. ‘మెల్లగా వెళ్లాలి’లేదా ‘ప్రమాదకరమైన మలుపు ఉంది’అని ఆటోమేటిక్‌గా గూగుల్‌ లేదా జీపీఎస్‌ యాప్‌ అప్రమత్తం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

సందేశం వస్తుందిలా..!
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటోంది. క్షణక్షణం సోషల్‌ మీడియా అప్‌డేట్స్‌ తదితరాల కోసం ఇంటర్‌నెట్‌ వాడుతున్నారు. తెలియని ప్రాంతానికి వెళ్లాలన్నా గూగుల్‌ మ్యాప్‌ లేదా జీపీఎస్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కూడా స్మార్ట్‌ఫోన్ల ద్వారా అప్రమత్తం చేయాలని పోలీస్‌ శాఖ భావిస్తోంది. ప్రతి స్మార్ట్‌ ఫోన్‌లో లొకేషన్‌ సర్వీస్‌ అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా గూగుల్‌ సంస్థ నుంచి నేరుగా వాహనదారును అప్రమత్తం చేసేందుకు పోలీస్‌ శాఖ ప్రయత్నిస్తోంది. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు లొకేషన్‌ సర్వీస్‌ ఆన్‌లో ఉంటే బ్లాక్‌ స్పాట్స్‌కు 200 మీటర్ల ముందే ఆటోమేటిక్‌గా సందేశం వచ్చేలా లేదా అలారం మోగే సౌకర్యం అందుబాటులోకి తేనున్నట్లు పోలీస్‌ వర్గాలు తెలిపాయి. 

ప్రతి వాహనానికీ జీపీఎస్‌ తప్పనిసరి.. 
రాష్ట్రంలోని ప్రతి వాహనానికీ జీపీఎస్‌ కిట్‌ తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా పోలీస్, రవాణా శాఖ సంయుక్తంగా ప్రభుత్వానికి ప్రతిపాదించే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనివల్ల రోడ్డు ప్రమాదాల నియంత్రణతో పాటు చోరీ వాహనాల జాడ, నేరస్తుల గుర్తింపు సులువవుతుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వ్యక్తిగత వాహనాల విషయంలో కొంత ఇబ్బంది ఉన్నా.. ఆటోలు, బస్సులు, స్కూల్‌ బస్సులు, లారీలు వంటి కమర్షియల్‌ వాహనాలకు జీపీఎస్‌ తప్పనిసరి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం.

ప్రమాదాల నియంత్రణలో కీలకం.. 
ఏటా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల వల్ల 6 వేల మంది మృతి చెందుతున్నారు. అనేక సందర్భాల్లో అతివేగం, ప్రమాదకర మలుపులు, రోడ్‌ ఇంజనీరింగ్‌ సమస్యలే ఇందుకు కారణమవుతున్నాయి. ఈ అప్రమత్త వ్యవస్థ వల్ల ప్రమాదాలను చాలా వరకు నియంత్రించొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

మరిన్ని వార్తలు