తాతయ్యా.. నువ్వూ వెళ్లిపోయావా..!

15 Jul, 2016 08:34 IST|Sakshi
తాతయ్యా.. నువ్వూ వెళ్లిపోయావా..!

అనాథలైన చిన్నారులు తాతకు తలకొరివి పెట్టిన పదేళ్ల బాలుడు
రెక్కలు తెగిన పక్షులకు దిక్కెవరు?

 
ముషీరాబాద్: ఆడుతూ.. పాడుతూ.. చదువుకోవాల్సిన వయసు వారిది.. అమ్మ చేతి గోరుముద్దలు తింటూ.. నాన్న ఒళ్లో కూర్చొని హాయిగా కబుర్లు చెప్పాల్సిన పిల్లలు వారు.. అయితే వారితో విధి వింతగా ఆడుకుంది.. ఎవరికీ లేని బాధను మిగిల్చింది.. అమ్మానాన్నలను పోగొట్టుకున్నారు.. తాతయ్య చెంత... భారంగా కాలం గడుపుతుండగా ఆ తాతయ్యకూడా వీరిని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. నా అన్న వారు లేక.. ఎవరూ రాక ఇప్పుడు ఆ చిన్నారులు రెక్కలు తెగిన పక్షుల్లా మిగిలిపోయారు.

మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నారాయణ నగరంలోని రాంనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించేవాడు. వాచ్‌మెన్‌గా పనిచేస్తూనే కుమారుడు బాలరాజుకు పెళ్లి చేశాడు. తరువాత ఇద్దరు సంతానం కలిగారు. అయితే బాలరాజు మద్యానికి బానిసయ్యాడు. ఈ కారణంగా బాలరాజు దంపతుల మధ్య వివాదం తలెత్తింది.  క్షణికావేశంలో అతని భార్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా..రక్షించే క్రమంలో బాలరాజుకు మంటలు అంటుకుని ఇద్దరూ అగ్నికి ఆహుతయ్యారు. తెలిసీ తెలియని వయసులో ఉన్న బాలరాజు పిల్లలు నితీష్ యాదవ్, శ్రీకరణిలను తాత నారాయణ పెంచి పెద్ద చేస్తున్నాడు.

తాను సంపాదించిన కొద్దిపాటి సొమ్మునే పిల్లలకు ఖర్చుపెట్టి పక్కనే ఉన్న పాఠశాలకు పంపిస్తున్నాడు. ఒక రోజు తింటే మరో రోజు పస్తులుంటూ  చదువుకుంటున్నవారికి ఉన్న ఒక్క ఆధారం లేకుండా పోయింది. నెల రోజులుగా అనారోగ్యం పాలైన నారాయణ గురువారం మృతి చెందాడు. దీంతో ఆ చిన్నారుల ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ఇక తమను చూసే వారెవ్వరని దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. స్థానికుల సహకారంతో తాత అంత్యక్రియలను నిర్వహించగా... పదేళ్ల నితీష్ యాదవ్ తల కొరివిని పెట్టడం హృదయాన్ని ద్రవింపజేసింది.

మానవతా వాదులూ స్పందించండి...
తల్లిదండ్రులను కోల్పోయి, ఉన్న ఆధారమైన తాత కూడా మరణించడంతో దిక్కులేని వారైన నితీష్ యాదవ్, శ్రీకరిణిలను మానవతావాదులు ఎవరైనా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వారికి సహాయ సహకారాలు అందించాలనుకుంటే 96182 52324 నంబరుకు ఫోన్ చేయవచ్చు.

>
మరిన్ని వార్తలు