సీమవాసులు ఆత్మగౌరవ ప్రతీకలు

3 Aug, 2015 08:53 IST|Sakshi
సీమవాసులు ఆత్మగౌరవ ప్రతీకలు

‘గ్రాట్’ సదస్సులో జస్టిస్ సుభాషణ్ రెడ్డి
హైదరాబాద్: రాయలసీమ వాసులు ఆత్మగౌరవం, బలం, పట్టుదలకు ప్రతీకలని ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి కొనియాడారు. ఆదివారం హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (గ్రాట్) ఆధ్వర్యంలో రాయలసీమ సాంస్కృతిక సదస్సు- సర్వసభ్య సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవాన్ని స్వీకరిస్తూనే, అందరం ఒక్కటై సమస్యలను పరిష్కరించుకొని, సమైక్యంగా ముందుకు సాగాలని సదస్సుకు హాజరైన ప్రతినిధులు నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ సుభాషణ్ రెడ్డి మాట్లాడుతూ నదుల అనుసంధానాన్ని ప్రభుత్వం సత్వరమే చేపట్టాలని సూచించారు. అప్పుడే కరువుతో కొట్టుమిట్టాడుతున్న రాయలసీమ వంటి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. చట్టం ప్రకారం అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ, ప్రభుత్వాలు... వరదలతో పంట నష్టపోయిన రైతులకు రూ.కోట్లకు కోట్లు నష్టపరిహారం చెల్లిస్తూ.. కరువు పరిస్థితులతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా వారికి అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక నుంచి రాయలసీమను రాళ ్లసీమ అనకుండా రత్నాల సీమ అని పిలవాలని సూచించారు. దివంగత సీఎం వైఎస్సార్‌ను మరువనని, రాజకీయాల్లో తనకు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడని గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చే సిన వారిలో రాయలసీమ నేతలే అధికంగా ఉన్నారని చెప్పారు. ఇక్కడి నుంచి ఎక్కువమంది సీఎంలు వచ్చినా ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని సీమవాసులు ప్రశ్నించలేకపోయారని అన్నారు.

సాగునీరు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరువుతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ సదస్సులో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎ. గోపాలరావు, గ్రాట్ వ్యవస్థాపక అధ్యక్షులు జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్యామల రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఎ.హనుమంతరెడ్డి, సి. ఆంజనేయరెడ్డి, గోపీనాథ్ రెడ్డి, ఇన్‌కమ్‌ట్యాక్స్ కమిషనర్ జీఆర్‌రెడ్డి, ‘సాక్షి’ డెరైక్టర్ వై.ఈశ్వర ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు