తెలుగు సినిమాకు దిశా నిర్దేశం చేసిన అక్కినేని

5 Feb, 2014 02:26 IST|Sakshi
తెలుగు సినిమాకు దిశా నిర్దేశం చేసిన అక్కినేని

నాంపల్లి, న్యూస్‌లైన్:
 చలనచిత్రరంగాన్ని గౌరవప్రదంగా మార్చిన ఘనత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకే దక్కుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి రవీంద్రభారతి ప్రధాన వేదికపై ఆకృతి ఆధ్వర్యంలో నవీన్ సుభాష్‌రెడ్డి సారధ్యంలో ‘వంద ఏళ్ల సినిమాకు సంగీత వందనం... అక్కినేని అమరస్మృతికి అంకితం’ పేరిట సినీ సంగీత విభావరి జరిగింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 
  అనంతరం ఆయన మాట్లాడుతూ ఈసభ ఎంతో విశిష్టమైందని తెలిపారు. మహోన్నతమైనవ్యక్తి కాలం చేస్తే సంతాప సభలు జరుపుకుంటారని.. కాలం చేసి ప్రజల హృదయాల్లో నిలిచినవ్యక్తి పేరిట ఉత్సవ సభను జరుపుకుంటారని వెల్లడించారు. ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో జరిగే అంకితం సభ ఉత్సవం లాంటిదని పేర్కొన్నారు. వందేళ్లు బ్రతుకుతానని ఉత్సాహంగా ఉండేవారు.. ఉన్నట్లుండి వెళ్లిపోవడం ఎంతో బాధాకరమన్నారు. తెలుగు సినిమాకు దిశా -నిర్దేశం చేసిన వ్యక్తి అక్కినేని అని అభివర్ణించారు. దేవదాసు చిత్రం ఎన్నోభాషల్లో వచ్చిందని, ఆ సినిమాకు అక్కినేనే తలమానికం కావడం ఆయన చేసుకున్న అదృష్టమన్నారు. గాయని రావు బాలసరస్వతి మాట్లాడుతూ అక్కినేని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. తాను పాటలు పాడేందుకు కారణం అక్కినేనే అని గుర్తుచేసుకున్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ కష్టపడిపైకి వచ్చే వారికి అక్కినేని స్ఫూర్తి దాయకమన్నారు. భాషా కార్యక్రమాల కోసం ఏది తలపెట్టినా సహకరిస్తానన్న వ్యక్తి కళ్లముందు లేకుండా పోవడం విచారకరమన్నారు. అనంతరం సినీ గాయనీగాయకులు ఆలపించిన సంగీత విభావరి అలరింపజేసింది.

మరిన్ని వార్తలు