గంగాధర్‌కు ఆర్టీసీ అధికారుల నివాళి

10 Sep, 2014 04:25 IST|Sakshi
గంగాధర్‌కు ఆర్టీసీ అధికారుల నివాళి

స్వగ్రామంలో విషాదం
 
గాంధీ ఆస్పత్రి: రోడ్డు ప్రమాదంలో సజీవ దహనమైన డ్రైవర్ పి.గంగాధర్(40) మతదేహానికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడకు వెళ్లిన ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రారావు, జేఎమ్డీ రమణారావు, ఆర్‌ఎం కృష్ణకాంత్, ఆర్మూర్ డిపో మేనేజర్ రాజమౌళితో పాటు, కంటోన్మెంట్ డిపోమేనేజర్ అరుణేష్‌కుమార్ గంగాధర్ మృతదేహానికి నివాళులర్పించారు. రెండేళ్లుగా కాంట్రాక్ట్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న గంగాధర్ క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకొని విధులను పర్మినెంట్ చేసేందుకు ఇటీవలే సిఫారసు చేసినట్టు ఆర్మూర్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.
 
ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన గంగాధర్ మృత్యు ఒడికి చేరుకోవడం పట్ల వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బాలకొండ మండలం సాలేరు గ్రామానికి చెందిన మృతుడు గంగాధర్‌కు భార్య దేవాయి, పిల్లలు తరుణ్, రుత్విక్ ఉన్నారు. గంగారాం, లింగవ్వలు తల్లితండ్రులు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
 
సాలేరులో విషాదం..
బాల్కొండ: గంగాధర్ బస్సు ప్రమాదంలో సజీవ దహనం కావడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆరుగురి అన్నదమ్ముల్లో మూడో వాడైన గంగాధర్‌ది నిరుపేద కుటుంబం. ట్రాక్టర్ డ్రైవర్‌గా, వ్యాన్ డ్రైవర్‌గా పనిచేసి అనంతరం ఆర్టీసీలో చేరాడు. అతని సర్వీసులో ఇప్పటి వరకు ఎలాంటి రిమార్కు లేదు. అర్హత ఉన్న కుటుంబ సభ్యుడి కి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
 
11 మందికి వైద్యసేవలు
ప్రమాదంలో గాయపడిన 11 మంది ప్రయాణికులు అంజిబాబు, వెంకటేశ్వరమ్మ, పుల్లమ్మ, రమణయ్య, కుమార్, నాగరాజు, సుధాకర్, ఏవీఎన్ ప్రసాద్, రామయ్య, కోటమ్మ, గోపాల్‌లకు వైద్యసేవలు అందించి డిశ్చార్జి చేశారు. తీవ్రంగా గాయపడిన మరో డ్రైవర్ మధును ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు