అప్పుడే షాక్!

22 Mar, 2016 03:29 IST|Sakshi
అప్పుడే షాక్!

గ్రేటర్‌లో మండుతున్న ఎండలు
రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
51.88 మిలియన్ యూనిట్లు దాటిన వైనం
లోడ్ రిలీఫ్ పేరిట కోతలు
వినియోగదారుల్లో ఆందోళన

సిటీబ్యూరో: మహా నగరంలో గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సోమవారం గరిష్టంగా 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది. ఈ ప్రభావం విద్యుత్ వినియోగంపై పడుతోంది. ఉక్కపోత నుంచి ఉపశమనానికి ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం పెరగడంతో విద్యుత్ వినియోగం రెట్టింపైంది. మార్చి మొదటి వారంలో 42 మిలియన్ యూనిట్ల లోపే ఉండగా... ప్రస్తుతం (శనివారం) రికార్డు స్థాయిలో 51.88 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగమైంది. రానున్న వేసవిలో గ్రేటర్ విద్యుత్ డిమాండ్ 58 ఎంయూలు దాటే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా. 

 
ఎల్‌ఆర్ పేరుతో ‘కోత’లు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 39 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 32.5 లక్షలు గృహ, 5.5 లక్షల వాణిజ్య కనెక్షన్లు. చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు మరో 40 వేలకుపైగా ఉన్నాయి. వీటి అవసరాలు తీర్చేందుకు సరిపడే విద్యుత్ ఉన్నా...పగటి ఉష్ణోగ్రతలకు తోడు ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతుండటం వల్ల ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పెరుగుతోంది. వీటివల్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయే ప్రమాదం ఉంది.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ప్రతి రెండు గంటలకోసారి 15 నిమిషాల పాటు అత్యవసర లోడ్ రిలీఫ్ పేరిట కోత విధిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే... ఏప్రిల్,   మే నెలల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

 
గరిష్టం..40.3 డిగ్రీలు..

నగరంలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం గరిష్టంగా 40.3, కనిష్టంగా 23.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత కారణంగా మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొందరు వాహనదారులు, పాదచారులు సొమ్మసిల్లారు. లస్సీ, కొబ్బరి బోండాలు, పండ్ల రసాలతో సేదదీరారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని, ఈ నెలాఖరుకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. ఆరేళ్ల తరవాత నగరంలో ఈ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. ఎండకు బయటికి వెళ్లేటప్పుడు కళ్లు, చర్మ సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నారులు ఎండ దెబ్బకు గురికాకుండా చూడాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

ఆందోళన అవసరం లేదు
గత ఏడాది మార్చి 2న గ్రేటర్‌లో 38.06 మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తే... ప్రస్తుత మార్చి 2న 46.38 మిలియన్ యూనిట్లకు పెరిగింది. గత ఏడాది 2,086 మెగవాట్ల డిమాండ్ ఉంటే ప్రస్తుతం 2,240 మెగవాట్లకు చేరింది. పెరుగుతున్న విద్యుత్ కనెక్షన్లు, డిమాండ్‌కు దీటుగా రూ.240 కోట్లు ఖర్చుతో సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేశాం. అత్యవసర పరిస్థితుల్లో మినహా కోతలు అమలు చేయడం లేదు. రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాపై ఆందోళన చెందాల్సిన  అవసరం లేదు. డిమాండ్‌ను తట్టుకునే విధంగా సరఫరా వ్యవస్థను మెరుగుపరిచాం.   -శ్రీనివాసరెడ్డి, డెరైక్టర్, ఆపరేషన్స్, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్

 

మరిన్ని వార్తలు