‘గ్రీన్ ఫార్మాసిటీ’ ఏ1నోటీసుపై స్టే

18 Aug, 2016 03:29 IST|Sakshi
‘గ్రీన్ ఫార్మాసిటీ’ ఏ1నోటీసుపై స్టే

8 వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
{పభుత్వానికి నోటీసులు.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం తదుపరి విచారణ
2 వారాలకు వాయిదా

 

హైదరాబాద్: గ్రీన్ ఫార్మాసిటీ కోసం అవసరమైన 493 ఎకరాల భూమిని చర్చలు, సంప్రదింపుల ద్వారా కొనుగోలు చేసేందుకు వీలుగా మండల తహసీల్దార్ ఈ ఏడాది జనవరిలో జారీ చేసిన ఏ1 నోటీసు అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. ఎనిమిది వారాల పాటు నోటీసు అమలును నిలిపేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట గ్రామంలో ఈ ఫార్మాసిటీ నిర్మించతలపెట్టిన విషయం విదితమే. అయితే చర్చల ద్వారా భూముల కొనుగోలు చేసే నిమిత్తం గత ఏడాది జూలైలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ ఎం.భారతమ్మ, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ జీవో ద్వారా కందుకూరు మండలంలోని సర్వే నంబర్ 112లోని 493 ఎకరాల భూములను గ్రీన్ ఫార్మాసిటీ కోసం కొనుగోలు చేసేందుకు తహసీల్దార్ జారీ చేసిన ఏ1 నోటీసును కూడా వారు సవాలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ చేపట్టారు.


2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయకుండా తప్పించుకోవడానికే ప్రభుత్వం ఈ జీవో 45 జారీ చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. పిటిషనర్లందరూ కూడా అసైన్‌మెంట్ పట్టాదారులని వివరించారు. సంప్రదింపుల పేరుతో భూములను బలవంతంగా తీసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే ఈ వాదనలను ప్రభుత్వ న్యాయవాది తోసిపుచ్చారు. స్వచ్ఛందంగా భూములను కొనుగోలు చేసే వ్యవహారంలో ఎవరికైనా అభ్యంతరాలుంటే వాటిని తెలుసుకునేందుకే తహసీల్దార్ ఏ1 నోటీసు జారీ చేశారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తహసీల్దార్ జారీ చేసిన ఏ1 నోటీసు అమలును ఎనిమిది వారాల పాటు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

 

>
మరిన్ని వార్తలు