ఖైదీల విడుదలకు గ్రీన్‌సిగ్నల్

18 Feb, 2016 04:29 IST|Sakshi

అరగంటలోనే ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం
 
 సాక్షి, హైదరాబాద్: జైళ్లలో మగ్గుతున్న జీవితఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.  సత్ప్రవర్తనతో ఉన్న ఖైదీలను జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసే ఆనవాయితీ ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఖైదీల విడుదల అంశాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. పలు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఖైదీల కుటుంబీకుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖైదీల విడుదలకు  నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అనుసరించాల్సిన మార్గదర్శకాలను రాష్ట్ర హోం శాఖలోని న్యాయ విభాగం బుధవారం జారీ చేసింది.

విడుదలకు  అర్హులైన ఖైదీల సంఖ్యను గుర్తించేందుకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో అయిదుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. తాజా నిబంధనల ప్రకారం రిమాండ్‌తో కలిపి అయిదేళ్ల శిక్షను అనుభవించిన మహిళాఖైదీలు విడుదల కానున్నారు. రిమాండ్‌తో కలిపి ఏడేళ్ల శిక్ష అనుభవించిన పురుష ఖైదీలు విముక్తికి అర్హులవుతారు. అరవై ఏళ్లు దాటిన మహిళలు, 65 ఏళ్లు నిండిన పురుష ఖైదీలకు వెసులుబాటు ఉంటుంది. ఈ అర్హత కాలాన్ని ఈ ఏడాది జనవరి 26ను కట్ ఆఫ్ డేట్‌గా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ ఉత్తర్వులపై మీడియాలో ప్రచారం కావటంతో అరగంట వ్యవధిలోనే వెనక్కి తీసుకుంది.

 65 మంది ఖైదీలు విడుదలయ్యే అవకాశం..
 ఖైదీల క్షమాభిక్షకు సంబంధించి గైడ్‌లైన్స్ ప్రకారం చర్లపల్లి నుంచి సుమారు 40 మంది ఖైదీలు, చంచల్‌గూడ సెంట్రల్ జైలు నుంచి 25 మంది ఖైదీలు క్షమాభిక్ష కింద విడుదలయ్యే అవకాశమున్నట్లు జైలు అధికారులు అంటున్నారు. గతంలో సత్తయ్య అనే పోలీసు అధికారి ఓ ముస్లిం వ్యక్తి పట్ల అనుచితంగా వ్యవహరించారనే నెపంతో అతడిని అంగరక్షకుడు ఖదీర్ కాల్చి చంపాడు. చర్లపల్లి జైలులో 23 ఏళ్ళుగా శిక్ష అనుభవిస్తున్న ఖదీర్ ప్రస్తుతం అనారోగ్యం బారిన పడ్డాడు. ఇలాంటి కేసులో శిక్ష అనుభవించేవారికి క్షమాభిక్ష వర్తించదు. ఖదీర్‌తోపాటుగా ఇలాంటి పలువురు ఖైదీలకు ఊరట కలిగే విధంగా ప్రభుత్వ గైడ్‌లైన్స్ రూపొందించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు