మైక్రో బ్రూవరీలకు గ్రీన్‌సిగ్నల్!

3 Jul, 2016 00:59 IST|Sakshi
మైక్రో బ్రూవరీలకు గ్రీన్‌సిగ్నల్!

- 20 డ్రాట్ బీర్ల యూనిట్ల ఏర్పాటుకు సర్కార్ అంగీకారం
- రూ. 3 లక్షల లెసైన్సు ఫీజుతో ఏర్పాటు కానున్న మైక్రో బ్రూవరీలు
మద్యం దుకాణాలు, బార్లలో బీర్ల అమ్మకాలపై ప్రభావం  
త్వరలో జారీ కానున్న అధికారిక ఉత్తర్వులు
 
 సాక్షి, హైదరాబాద్: రాజధానిలో బీరు తయారీ యూనిట్ల ఏర్పాటుకు త్వరలో అనుమతులు రానున్నాయి. తద్వారా రెస్టారెంట్లు, బార్లు నిర్వహిస్తున్న వ్యాపారులు సొంత  బ్రాండ్‌తో బీరు తయారీ యూనిట్ (మైక్రో బ్రూవరీ)ను ఏర్పాటు చేసుకొని తమ రెస్టారెంట్లలో విక్రయించుకునే వీలు కలుగుతుంది. ఈ మేరకు మైక్రో బ్రూవరీల అనుమతి మంజూరు ఫైలుపై శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేసినట్లు తెలిసింది. మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు సంబంధించి గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా 50 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి 49 దరఖాస్తులు రాగా, ఒకటి వరంగల్ నుంచి వచ్చింది.

వీటిని పరిశీలించిన ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న 20 దరఖాస్తులను అర్హమైనవిగా గుర్తించింది. వీటికి అనుమతి మంజూరు చేయాలని ప్రభుత్వానికి పంపగా.. ఆబ్కారీ శాఖ మంత్రి టి. పద్మారావు వాటిని ఆమోదించి, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా సొంత బ్రాండ్లతో బీర్ల తయారీ కోసం మైక్రో బ్రూవరీలకు అనుమతిస్తే కోట్లాది రూపాయల లెసైన్సు ఫీజులు చెల్లించి ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు, బార్లలో బీర్ల అమ్మకాలపై ప్రభావం పడుతుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

 రూ. 3 లక్షల లెసైన్సు ఫీజుతో...
 గ్రేటర్ హైదరాబాద్‌లో మద్యం దుకాణం లెసైన్సు ఫీజు ఏడాదికి రూ. 1.08 కోట్లు ఉండగా, బార్‌కు రూ. 35 లక్షలు. క్లబ్బుల్లో బార్ ఏర్పాటు చేయాలన్నా రూ. 6 లక్షలు చెల్లించాలి. కానీ మైక్రో బ్రూవరీలకు మాత్రం వార్షిక లెసైన్సు ఫీజును రూ. 3 లక్షలుగా నిర్ణయించారు. సొంత బ్రాండ్‌తో రోజుకు వెయ్యి బల్క్ లీటర్లకు మించకుండా డ్రాట్ బీరును ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈ బ్రూవరీల్లో ఉత్పత్తి అయ్యే బీరు ఇతర ప్రాంతాలకు సరఫరా కావడం నేరం. మైక్రో బ్రూవరీ ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌లోనే దీనిని మగ్గులు, పిచ్చర్ కొలతల్లో విక్రయించాలి. ఈ బీరును ఉత్పత్తి అయిన 36 గంటల్లోనే వినియోగించాలి. సమయం దాటి తే ఆ బీరును నాశనం చేయాల్సిందే! కాగా ఈ బీరు తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు 1,000 చదరపు మీటర్ల స్థలం తప్పనిసరి. ఇందులో 300 చ.మీ. స్థలం ప్లాంట్ కోసం కాగా, వందేసి మీటర్ల చొప్పున సర్వింగ్ ఏరియా, రెస్టారెంట్లకు వినియోగించాలి.
 
 అక్టోబర్ నుంచి అందుబాటులోకి
 ప్రభుత్వం అనుమతించనున్న బ్రూవరీల లెసైన్సు కాలపరిమితి అక్టోబర్ 1 నుంచి  సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని 2015 ఆగస్టు 28న జారీ చేసిన నోటిఫికేషన్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ లెక్కన ప్రస్తుతం అనుమతి పొందే మైక్రో బ్రూవరీలు డ్రాట్ బీర్ల ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించిన తరువాత అక్టోబర్ 1 నుంచి వినియోగదారులకు అందించనున్నాయి.

మరిన్ని వార్తలు