త్వరలో గ్రీన్‌హౌస్ మార్గదర్శకాలు

9 Nov, 2014 00:28 IST|Sakshi
త్వరలో గ్రీన్‌హౌస్ మార్గదర్శకాలు

* రాష్ట్రస్థాయిలో రెండు, జిల్లాస్థాయిలో ఒకటి
* త్వరలో కంపెనీల నుంచి టెండర్లకు ఆహ్వానం
* నెలాఖరులోగా రైతుల నుంచి దరఖాస్తులు

 
సాక్షి, హైదరాబాద్: ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పూలు, పళ్లు, కూరగాయల తోటల పెంపకం కోసం చేపట్టే అతిపెద్ద ప్రాజెక్టు గ్రీన్‌హౌస్. వెయ్యి ఎకరాల్లో   దీనిని అమలు చేయడానికి బడ్జెట్‌లో రూ. 200 కోట్లను కేటాయించారు. ప్రాజెక్టు మార్గదర్శకాల ఖరారుకు మూడు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఉద్యానశాఖ కమిషనర్ ఛైర్మన్‌గా రాష్ట్రస్థాయిలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ శాఖ జాయింట్ డెరైక్టర్ మెంబర్ కన్వీనర్‌గా, మరో 12 మంది సభ్యులుగా ఉంటారు. ప్రాజెక్టు అమలును ఈ కమిటీ పర్యవేక్షించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

రెండోది రాష్ట్రస్థాయి టెక్నికల్ కమిటీ. హార్టికల్చర్ యూనివర్సిటీ డెరైక్టర్ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో 11 మంది సభ్యులుంటారు. ప్రధానకమిటీ ఇచ్చే మార్గదర్శకాలను ఇది అమలుచేస్తుంది. యూనిట్‌ల ధరలు నిర్ణయిస్తుంది. గ్రీన్‌హౌస్‌కు టెండర్లను ఆహ్వానిస్తుంది. ఆయా కంపెనీల సాంకేతిక సామర్థ్యం, కోట్‌చేసే ధరలను అధ్యయనం చేసి టెండర్లను ఖరారు చేయడంలో కీలకపాత్ర వహిస్తుంది. మూడవకమిటీ జిల్లాస్థాయిలో కలెక్టర్ ఛైర్మన్‌గా ఎగ్జిక్యూటివ్/మానిటర్ కమిటీగా ఉంటుంది. ఇందులో 10 మంది సభ్యులుంటారు. క్షేత్రస్థాయిలో గ్రీన్‌హౌస్‌ను అమలుచేసే బాధ్యత వీరిదే. రైతుల దరఖాస్తులు స్వీకరించడం, అర్హులను గుర్తించడం వీరి బాధ్యత.  క్షేత్రస్థాయి పర్యటనలు చేసి రైతులకు శిక్షణ, సెమినార్లు నిర్వహిస్తారు.

నెలాఖరులోగా దరఖాస్తుల స్వీకరణ...
నెలాఖరులోగా గ్రీన్‌హౌస్ ప్రాజెక్టుకు  రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఉద్యానశాఖ యోచిస్తోంది. మార్గదర్శకాలు ఖరారయ్యాక ఆసక్తి గల రైతులను గుర్తించాలని నిర్ణయించింది. హైదరాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల పరిధిలో దీన్ని చేపట్టాలని అనుకుం టున్నా, ఇతర ప్రాంతాల వారు ఆసక్తి చూపితే వారికి కూడా అనుమతి ఇవ్వాలని యోచి స్తోంది. ఉద్యానశాఖ జాయింట్ డెరైక్టర్ వెంకట్రామ్‌రెడ్డి ఇప్పటికే పలు సమావేశాలు జరి పారు. టెండర్లను పిలువడానికి సన్నాహాలు చేస్తున్నారు. నగర శివారులో ఏర్పాటు చేసిన గ్రీన్‌హౌస్‌లను అధ్యయనం చేసి ఏ కంపెనీకి ఇస్తే బాగుంటుందో అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు