గ్రూప్-1 మెయిన్స్ 13వ తేదీ పరీక్ష వాయిదా

9 Sep, 2016 20:24 IST|Sakshi

హైదరాబాద్: 2011 గ్రూప్-1 మెయిన్స్ తొలి రోజు పరీక్షను ఈనెల 13వ తేదీ నుంచి 24వ తేదీకి మార్పు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మెయిన్స్ పరీక్షలు ఈనెల 13 నుంచి ప్రారంభమై 23వ తేదీ వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ ఇంతకు ముందు ప్రకటించింది. అయితే బక్రీద్ పండగను ఈనెల 12వ తేదీకి బదులు 13వ తేదీకి మార్పు చేయడంతో ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్ తొలి రోజు పరీక్షను 13వ తేదీకి బదులు 24వ తేదీకి మార్పు చేసింది. విద్యార్ధులు ఈ మార్పును గమనించాలని సూచించింది.

పరీక్ష కేంద్రాలు దూరాభారం
ఇలా ఉండగా హైదరాబాద్ కేంద్రంగా పరీక్షలు రాయాలనుకున్నవారికి కేటాయించిన సెంటర్లు దూరాభారంగా ఉన్నాయని ఆయా అభ్యర్ధులు వాపోతున్నారు. ముఖ్యంగా గ్రూప్-1 పరీక్షల కోసం తెలంగాణ ప్రాంత జిల్లాలవారే కాకుండా ఏపీలోని పలు జిల్లాల నుంచి అభ్యర్ధులు హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో చేరారు. వీరంతా పరీక్షలను హైదరాబాద్ కేంద్రం నుంచి రాయడానికి ఆప్షన్ ఇచ్చారు. అయితే వీరికి కేటాయించిన కేంద్రాలు హైదరాబాద్‌ నుంచి 40 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండడంతో తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.

పరీక్ష కేంద్రానికి వెళ్లిరావడానికి దాదాపు 2గంటలకు పైగా సమయం పడుతోందని, ఇలా పరీక్షలన్ని రోజులూ అయిదారు గంటలు ప్రయాణానికే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ విద్యాసంస్థలను కేంద్రాలుగా కేటాయింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు కావలసి ఉందని ఏపీపీఎస్సీ వర్గాలు వివరించాయి. అనుమతుల విషయంలో ఇబ్బందులు ఉన్నందున ప్రైవేటు విద్యాసంస్థలను ఎంచుకుని అభ్యర్ధులకు కేటాయించామని పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు