పవన సుతుని శోభాయాత్ర

4 Apr, 2015 00:41 IST|Sakshi
పవన సుతుని శోభాయాత్ర

ఏర్పాట్లు పూర్తి
లక్ష బైక్‌లతో యాత్రకు సన్నాహాలు
వివిధమార్గాలలో ట్రాఫిక్ మళ్లింపు
నగరంలో భారీ బందోబస్తు
జేఈఈ అభ్యర్థులకు ఇబ్బంది కలుగనివ్వం: కమిషనర్

 
సాక్షి, సిటీబ్యూరో : హనుమాన్ జయంతి నేపథ్యంలో నగరం కాషాయమయమైంది. బస్తీలు, కాలనీలలోని హనుమాన్ దేవాలయాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకునేందుకు ఈసారి లక్ష బైక్‌లతో శోభాయాత్రకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర సాగే రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం చంద్రగ్రహణం నేపథ్యంలో దేవాలయాలు మధ్యాహ్నం 3 గంటలకే మూసివేయాలని నిర్ణయించారు.

ఈలోగా శోభాయాత్ర ముగిసేలా నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం గౌలిగూడలోని రామమందిరం వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభమై... సాయంత్రం ఆరు గంటలకు దాడ్‌బన్ హనుమాన్ దేవాలయానికి యాత్ర చేరుకునేది. సుమారు 8 గంటలు సాగేది. చంద్రగ్రహణం నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ సమయాన్ని ఐదు గంటలకు కుదించారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఈ విషయాన్ని భక్తులకు తెలియజేస్తున్నారు.

ఈసారి ఉదయం పది గంటల లోపే ప్రారంభించాలని అనుకుంటున్నారు. వివిధ బస్తీలు, కాలనీల నుంచి ప్రారంభించే శోభాయాత్రను కూడా త్వరగా ప్రధాన యాత్రతో కలపాలని నిర్వాహకులకు ఇప్పటికే సూచించారు. రహదారులపై స్వాగత వేదికలు, నీళ్లు, ఫలహారాలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

యాత్ర ఎక్కువ సేపు ఆపకుండా వెంటవెంటనే పంపించేందుకు వలంటీర్లు సహకరిస్తారు. ఆంధ్రా బ్యాంక్ చౌరస్తాలో సామూహిక హనుమాన్ చాలీసా పఠనం ఉంటుంది. ఆ వేదిక నుంచి బజరంగ్‌దళ్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాజేష్ పాండే ప్రధాన ఉపన్యాసం చేస్తారు. యాత్ర ముగిసిన తరువాత తాడ్‌బన్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగే బహిరంగ సభలో విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి ప్రసంగిస్తారు.

శోభాయాత్ర మార్గాలు ఇవే...

గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమయ్యే యాత్ర పుత్లీబౌలీ క్రాస్ రోడ్డు, ఆంధ్రాబ్యాంక్ క్రాస్ రోడ్డు, డీఎం అండ్ హెచ్‌ఎస్ సర్కిల్, రాంకోఠి క్రాస్ రోడ్డు, కాచిగూడ క్రాస్ రోడ్డు, వైఎంసీఏ, నారాయణగూడ సర్కిల్, నారాయణగూడ ప్లై ఓవర్, ఆర్‌టీసీ క్రాస్ రోడ్డు, అశోక్‌నగర్ క్రాస్‌రోడ్డు, గాంధీనగర్ టీ జంక్షన్ వరకూ వెళుతుంది.

అక్కడి నుంచి కవాడీగూడ క్రాస్‌రోడ్డు, బైబిల్ హౌస్, గ్యాస్ మండీ క్రాస్‌రోడ్డు, బాటా క్రాస్ రోడ్డు, సుభాష్ క్రాస్ రోడ్డు, రాంగోపాల్‌పేట పీఎస్, ఎంజీ రోడ్డు, ప్యారడైజ్, సీటీఓ క్రాస్‌రోడ్డు, బాలంరాయి, తాడ్‌బన్ క్రాస్ రోడ్డు, చిన్నటాకోట బ్రిడ్జి, సెవెన్ టెంపుల్ రోడ్డు, న్యూ బోయిన్‌పల్లి, సరోజినీ పుల్లారెడ్డి బిల్డింగ్, సెంట్రల్ పాయింట్, డైమండ్ పాయింట్, మస్తాన్ కేఫ్, మీదుగా తాడ్‌బన్ హనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది. ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్టు పోలీసులు తెలిపారు.

భారీ బందోబస్తు

శోభాయాత్రలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసు, ఆర్ముడ్ పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  సంబంధిత సిబ్బంది బందోబస్తులో ఉంటున్నారు. సీసీ కెమెరాల ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ రూంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఈ యాత్రను పర్యవేక్షిస్తారు.

మరిన్ని వార్తలు