హ్యాపీ కస్టమర్స్..

31 Dec, 2013 04:14 IST|Sakshi
హ్యాపీ కస్టమర్స్..

=మహేష్ బ్యాంకుకు చేరిన దోపిడీ బంగారం
 =ఆనందం వ్యక్తం చేసిన కస్టమర్లు
 =తాకట్టు బంగారం తీసుకెళ్లిన వైనం

 
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో సంచలనం సృష్టించిన దోపిడీకి గురైన 14.5 కిలోల బంగారు ఆభరణాలు నెలరోజుల తర్వాత ఎట్టకేలకు మహేష్ బ్యాంకుకు చేరింది. దీంతో బ్యాంకు వినియోగదారులు (కస్టమర్లు) ఉబ్బితబ్బిబ్బయ్యారు. గతనెల 28న రాత్రి ఏఎస్‌రావునగర్‌లోని మహేష్ బ్యాంకులో గోల్డ్ అప్రయిజర్‌గా విధులు నిర్వహిస్తున్న వరంగల్ జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన మాచర్లోజు బ్రహ్మచారి (50) మారుతాళం చెవులతో తాకట్టు పెట్టిన బంగారాన్ని దోచుకున్న విషయం తెలిసిందే.

ఈ కేసును నాలుగురోజుల్లోనే సైబరాబాద్ పోలీసులు మిస్టరీ చేధించి బ్రహ్మచారితోపాటు అతని భార్య లలిత, కుమారుడులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగలను కుషాయిగూడ పోలీసు ఠాణాలో భద్రపరిచారు. న్యాయపరమైన అంశాలు పూర్తిచేసుకోవడంతో సోమవారం కోర్టు అనుమతితో పోలీసుల ఆధీనంలో ఉన్న ఆభరణాలను బ్యాంకు అధికారులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న కస్టమర్లు చాలామంది బ్యాంకు వచ్చి తాకట్టు పెట్టిన నగలను విడిపించుకెళ్లారు.

ఈ సందర్భంగా కస్టమర్లు పోలీసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అయితే ఈ కేసులోని నిందితులు కూడా బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. బంగారు నగలు భద్రపర్చడంలో నిర్లక్ష్యం వహించిన అటెండర్ రాములు, సీనియర్ అకౌంటెంట్ శివశంకర్‌లను ఇదివరకే అరెస్టు చేయగా..బ్యాంకు ఎండీ, జనరల్ మేనేజర్, మేనేజర్ పద్మజ, ఉద్యోగులు ఊర్మిల, ప్రశాంతిల నిర్లక్ష్యంపై ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో వీరి నిర్లక్ష్యం ఉందని స్పష్టంగా తేలితే అరెస్టు చేస్తామని కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టంచేశారు.
 

మరిన్ని వార్తలు