పూర్ణిమ సాయి కథ సుఖాంతం

19 Jul, 2017 16:25 IST|Sakshi
పూర్ణిమ సాయి కథ సుఖాంతం

హైదరాబాద్‌ : పదో తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లేందుకు ఆమె అంగీకరించింది. సైకాలజిస్టుల కౌన్సెలింగ్‌తో పూర్ణిమ సాయి మనసు మార్చుకుంది. ముంబై స్టేట్‌హోంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు వద్దకు వెళ్లనని, వాళ్ల ముఖాలే చూడనని తెగేసి చెప్పిన పూర్ణిమ... హైదరాబాద్‌కు రాగానే సానుకూలంగా స్పందించింది. గత నెల 7న అదృశ్యమై ముంబై చేరిన పూర్ణిమ సాయిని పోలీసులు ఇవాళ ఉదయం హైదరాబాద్‌ నింబోలి అడ్డాలోని బాలికాసదన్‌లో చేర్చారు.

సుదీర్ఘ ప్రయాణం చేయటంతో అలసిపోయిన పూర్ణిమ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. అయితే పూర్ణిమ ఆరోగ్యం  కుదుటపడ్డాకా... చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ  మరోసారి సమావేశమై  పూర్ణిమ ఇష్టానుసారం నిర్ణయం తీసుకోనున్నారు. పూర్ణిమ తండ్రి నాగరాజు మాట్లాడుతూ ‘పూర్ణిమ మాతో రావడానికి ఒప్పుకుంది. మాతో అరగంట పాటు మాట్లాడింది. అయితే అధికారికంగా పాపను మాకు అప్పగించేందుకు మరో రెండు రోజులు పడుతుంది.’ అన్నారు.

ఈ సందర్భంగా పూర్ణిమ సాయి అమ్మమ్మ మాట్లాడుతూ ‘తల్లిదండ్రులతో కలిసి ఉంటే ఆపద వస్తుందని కలలో పూర్ణిమకు షిర్డీ సాయి చెప్పాడట. సైకాలజిస్టులతో పాటు మేం కూడా నచ్చజెప్పాం. మా ప్రయత్నం ఫలించింది. తల్లిదండ్రులతో ఉండేందుకు అంగీకరించింది.’ అని తెలిపారు.

మరోవైపు  పూర్ణిమసాయికి  న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అంజన్‌రావు స్పష్టం చేశారు. పూర్ణిమ సాయి ఉదంతం మొత్తాన్ని  చైల్డ్ రైట్స్‌ కమిషన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. బాలల హక్కుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అసలు పూర్ణిమ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో వాస్తవాలను తెలుసుకుంటామని చెప్పారు.

మరిన్ని వార్తలు