ఎన్నికల వేళ..వరాల వాన

3 Jan, 2016 02:02 IST|Sakshi
ఎన్నికల వేళ..వరాల వాన

మంత్రిమండలి నిర్ణయాలపై సంతోషం
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల హర్షాతిరేకాలు
 సాక్షి, సిటీబ్యూరో:
  జీహెచ్‌ఎంసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను.... ప్రజలను... రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు ఆనంద డోలికల్లో ముంచుతున్నాయి.  జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను రూ.1,200 లోపు ఉన్న వారందరికీ నామమాత్రంగా రూ.101 మాత్రమే వసూలు చేయనున్నారు. దీంతో సుమారు 5.09 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను దాదాపు రెట్టింపు చేయనున్నారు. దీనివల్ల సుమారు 7,500 మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ప్రస్తుతం 6,700 అందుకుంటున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనం రూ.12 వేలకు... రూ.8,400 ఉన్న వారికి రూ.15 వేలకు పెరగనుంది. ఇప్పుడు రూ.10,900 వేతనం ఉన్న వారికి భవిష్యత్తులో రూ.17 వేలు అందుతుంది. ఈ నెల నుంచే ఇవి వర్తింపజేయనున్నారు. దీంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
 
 3 లక్షల కుటుంబాలకు మేలు
 గ్రేటర్‌లో నీటి పన్ను బకాయిలు రూ.450 కోట్లు మాఫీ చేయాలన్న మంత్రిమండలి నిర్ణయంతో 3 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. దీనిపై నగరంలోని అల్పాదాయ, మధ్యాదాయ వర్గాల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. పాత నగరంలోని నీటి వినియోగదారులు అధికంగా లబ్ధి పొందనున్నారు. నగర శివారులోని శామీర్‌పేట్, రాచకొండల్లో భారీ నీటి రిజర్వాయర్లు నిర్మించాలనే నిర్ణయంతో గ్రేటర్ ప్రజల దాహార్తి తీరగలదని జలమండలి వర్గాలు చెబుతున్నాయి.
 

మరిన్ని వార్తలు