చిన్నారిపై అకృత్యం...

18 Dec, 2015 14:57 IST|Sakshi
చిన్నారిపై అకృత్యం...

సీసీ కెమెరా ఫుటేజీతో బయటపడ్డ దారుణం
అరగంటలోనే కేసు విచారణ, నిందితుడి అరెస్టు

 
చార్మినార్: అతడి పేరు మహ్మద్ అక్రం ఖాన్... వయస్సు 46 ఏళ్లు... ఇతనికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కామపిశాచిగా మారాడు. భార్య దగ్గరికి రానివ్వడం లేదని అభం.. శుభం తెలియని ఎల్‌కేజీ చిన్నారి (4)తో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. పాపంపండి అడ్డంగా దొరికి పోయాడు...  శాలిబండ ఠాణా పరిధిలోని పూల్‌బాగ్ చున్నీకాబట్టి ప్రాంతానికి చెందిన మహ్మద్ అక్రం ఖాన్ రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఇతని ఇంట్లో నాలుగు కుటుంబాలు అద్దెకుంటున్నాయి. తన ఇంట్లో అద్దెకుండే ఓ చిన్నారికి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చాక్లెట్లు ఎర వేసి ‘పశువు’గా ప్రవర్తిస్తున్నాడు. ఎన్ని రోజులుగా ఇది జరుగుతుందోగాని... తనకు తెలియకుండానే తన ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ తతంగమంతా రికార్డు కావడంతో గరువారం విషయం బయటపడింది.  

సీసీ కెమెరాలు అమర్చిన భార్య...
భర్త మహ్మద్ అక్రం ఖాన్‌పై అనుమానంతో భార్య ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ విషయం భర్తకు తెలియదు. అక్రంఖాన్ రోజూ ఇంట్లో వ్యాయామం చేస్తూ చిన్నారితో అసభ్యకరంగా వ్యవహరిస్తున్న దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. అయితే, సీసీ కెమెరాల్లోని  పుటేజీలను పరిశీలించడం ఎలాగో భార్యకు తెలియకపోవడంతో బస్టాండ్ వద్ద గోడలపై ఉన్న నెంబర్ల ఆధారంగా ఓ సీసీ కెమెరా టెక్నీషియన్‌కు ఫోన్ చేసింది.  వెంటనే ఉమర్ బాక్రీ అనే టెక్నీషియన్ రాగా.. అతని సహాయంతో సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించింది. అందులోని దృశ్యాలు చూసి నిర్ఘాంతపోయిన ఆమె మౌనంగా ఉండిపోయింది.

తెలిసిందిలా...
కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా దక్షిణ మండలం పోలీసులు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ సీసీ టీవీ టెక్నీషియన్స్‌కు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా టెక్నీషియన్స్ అనుభవాలను తెలుసుకుంటుండగా...  టెక్నీషియన్ ఉమర్ బాక్రీ ఇటీవల తాను మహ్మద్ అక్రంఖాన్ ఇంట్లో చూసిన చిన్నారిపై అకృత్యాలకు సంబంధించిన వీడియో ఫుటేజీ గురించి ప్రస్తావించాడు.

అర గంటలోనే...
గురువారం మధ్యాహ్నం టెక్నీషియన్ ఉమర్ బాక్రీ ద్వారా ఈ సమాచారం అందుకున్న వెంటనే దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ రంగంలోకి దిగారు. డీసీపీ పర్యవేక్షణలో శాలిబండ పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. నిమిషాల్లో నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు మహ్మద్ అక్రం ఖాన్ నేరం అంగీకరించడంతో ఐపీసీ 377, 363, 366 సెక్షన్ల కింద సుమోటోగా కేసు నమోదు చేసి ఫలక్‌నుమా ఏసీపీని విచారణాధికారిగా నియమించారు. కేసు విచారణ, నిందితుడి అరెస్టును డీసీపీ అరగంటలోనే పూర్తి చేయడం విశేషం.  
 
మొదట్లో బుకాయించిన నిందితుడు...
విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితున్ని గురువారం దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ వద్దకు తీసుకురాగా... తాను ఎంతో మంచి వాడినని... ఐదుసార్లు నమాజ్ చేస్తానని... రియల్ ఎస్టేట్ దందా తప్పా... ఎటువంటి వ్యాపకాలు లేవన్నాడు. తాను చిన్నారి పట్ల  వ్యవహరించిన తీరు సీసీ కెమెరాల్లో రికార్డయిన విషయం తెలి యని నిందితుడు మొదట్లో బుకాయించే ప్రయత్నం చేశాడు. సీసీ పుటేజీలను చూపించడంతో... గతంలో ఇలాంటి పనులు ఎప్పుడు చేయలేదని... ఇక ముందు కూడా చేయనని... ఈసారికి తనను వదిలేయాలంటూ ప్రాథేయపడ్డాడు.

మరిన్ని వార్తలు