పుల్లలు పెడుతూ స్నేహమంటారా?

22 Sep, 2016 04:19 IST|Sakshi
పుల్లలు పెడుతూ స్నేహమంటారా?

చంద్రబాబుపై మండిపడిన హరీశ్
స్నేహంగా మెలిగితే సమస్యలు పరిష్కారమవుతాయన్న బాబు
మరి ప్రాజెక్టులకు ఎందుకు అడ్డుపడుతున్నారని నిలదీసిన హరీశ్
కేసీఆర్ జోక్యంతో సద్దుమణిగిన వాగ్వాదం

 సాక్షి, హైదరాబాద్: అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ మంత్రి హరీశ్‌రావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాదనల సందర్భంగా ఇరు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా మెలిగితే సమస్యలు పరిష్కారమవుతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఓవైపు స్నేహపూర్వకమంటూనే మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులకు పుల్లలు పెడుతున్నారని, అడ్డు పడుతున్నారంటూ విరుచుకుపడ్డారు.

పాలమూరు, డిండి ప్రాజెక్టులు కట్టవద్దని అపెక్స్ భేటీలో ఎలా వాదిస్తారని.. స్నేహపూర్వకంగా మెలిగేవారు ఇలా చేస్తారా? అని బాబును నిలదీశారు. నల్లగొండ జిల్లాలో ఊళ్లను ఖాళీ చేయించి మరీ పులిచింతలలో నీళ్లు నింపుకొనేందుకు ఏపీకి సహకరించామని, పంటలు ఎండిపోతున్నాయంటే సాగర్‌కు నీళ్లు విడుదల చేశామని పేర్కొన్నారు. కానీ ఏపీ మాత్రం ప్రతి విషయంలో అడ్డుతగులుతోందని మండిపడ్డారు. కర్ణాటకను ఒప్పించి ఆర్డీఎస్ పనులు చేయించుకుంటే అడ్డుపడ్డారన్నారు.

నందిగామ ప్రాంతంలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నందున సాగర్ ఎడమ కాల్వ నీళ్లు అక్కడికి చేరేదాకా శ్రద్ధ తీసుకోవాలని ఏపీ మంత్రి దేవినేని ఉమ కోరగా.. హరీశ్ తీవ్రంగా స్పందించారు. ‘‘సాగర్‌కు నీటి విడుదల కోరుతారు. శ్రీశైలం నీటిని మాత్రం విడుదల చేయరు..’ అని విమర్శించారు. ఇలా వాగ్వాదం పెరగడంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. రెండు రాష్ట్రాల రైతులు, ప్రజల అవసరాల మేరకు ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని వ్యాఖ్యానించారు.

ఆంధ్ర ప్రాంత రైతుల సాగునీటి, ప్రజల తాగునీటి అవసరాలను తాము దృష్టిలో పెట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఉమాభారతి సైతం జోక్యం చేసుకున్నారు. ప్రశాంతంగా కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని.. అప్పుడప్పుడూ కూర్చొని చాయ్ తాగుతూ మాట్లాడుకోవాలని సూచించారు. దీంతో హరీశ్ శాంతించారు.

మరిన్ని వార్తలు