రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు కుట్ర

4 May, 2016 03:01 IST|Sakshi
రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు కుట్ర

తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలన్న ఏపీ కేబినెట్ తీర్మానంపై హరీశ్
జగన్‌పై పైచేయి సాధించేందుకే ఈ కుటిల రాజకీయం
ప్రాజెక్టులను కట్టి తీరుతామని స్పష్టీకరణ
నీళ్ల దోపిడీపై చర్చకు చంద్రబాబు సిద్ధమా అని సవాలు

 సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజె క్టుకు భూమి పూజ చేసుకుని తెలంగాణ ప్రజలు సంబరపడుతుంటే చూసి ఓర్వలేక కళ్ల మంటతో ఏపీ కేబినెట్ తీర్మానం చేసిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి, దీక్ష చేస్తానంటున్న వైఎస్ జగన్‌పై పైచేయి సాధించడానికే... చంద్రబాబు సర్కారు కుటిల రాజకీయానికి పాల్పడుతోందని మండిపడ్డారు. తెలంగాణ రైతులను, ప్రాజెక్టులను బలి చేయాలనుకోవడం వారి వంకర బుద్ధిని బయట పెడుతోందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ కేబినెట్ చేసిన తీర్మానంపై మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.

 ఏపీవన్నీ అవాస్తవాలే..
ప్రాజెక్టులు, జలాలపై ఏపీ చెబుతున్నవన్నీ అవాస్తవాలని, వారి మాటలను ఎవరూ నమ్మరని హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘‘ఏపీ కేబినెట్ తీర్మానం చెల్లని రూపాయి.. దానికి ఎలాంటి విలువా లేదు. కాబట్టే కోర్టులకు పోతామంటున్నారు. కోర్టుల్లో కేసును ఏళ్లకేళ్లు సాగదీసి ప్రాజెక్టులు కట్టకుండా కుట్రలు పన్నుతున్నారు. వారు ప్రాజెక్టులను ఆపలేరు. కట్టి తీరుతం. నేనే ప్రాజెక్టుల దగ్గర కూర్చుని, అక్కడే నిద్రపోయి ప్రాజెక్టులు పూర్తి చేస్తా..’’ అని స్పష్టం చేశారు.

అక్రమ ప్రాజెక్టులు కట్టింది ఏపీ అని, అన్యాయంగా గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి అనుమతి తీసుకుని పట్టిసీమ కట్టారని... పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు ఏం అనుమతులు ఉన్నాయని ప్రశ్నించారు. కృష్ణాబేసిన్‌లోనే ఉన్న పాలమూరు, నల్లగొండ జిల్లాలకు కృష్ణా నీరు ఇస్తామంటే అడ్డుతగులుతారా అని నిలదీశారు. నీళ్ల దోపిడీపై చర్చకు చంద్రబాబు సిద్ధమా, దీనిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాయగలరా అని సవాల్ విసిరారు.

 కేటాయింపుల మేరకే..
బచావత్ అవార్డు ప్రకారం కృష్ణా నికర జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయించారని.. దీంతోపాటు 77టీఎంసీల మిగులు జలాలను తెలంగాణకు కేటాయించారని హరీశ్‌రావు పేర్కొన్నారు. మొత్తంగా 376 టీఎంసీల నీటి వాటా ఉందని... పాలమూ రు, డిండి కట్టినా 250 టీఎంసీలకు మించి వాడుకునే పరిస్థితి లేదన్నారు. అలాంటిది తెలంగాణ వాటాకు మించి నీళ్లు వాడుతున్నట్లు దుష్ర్పచారం ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. కృష్ణా జలాల్లో ప్రతి రాష్ట్రానికి గంపగుత్త కేటాయింపులు (ఎన్‌బ్లాక్) ఉన్నాయని, దాని ప్రకారమే పాలమూరు, డిండి కడుతున్నామని తెలిపారు.

అవి పాత ప్రాజెక్టులే..
కృష్ణాలో 70 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013లోనే జీవో 72 ఇచ్చారని... కృష్ణాలో 30టీఎంసీల నీటిని వాడుకుంటూ డిండి ఎత్తిపోతలను చేపట్టేందుకు 2007 జూలై7న జీవో 159 ఇచ్చారని హరీశ్‌రావు గుర్తు చేశారు. అంటే ఇవి పాత ప్రాజెక్టులేనని, దీనికోసం కొత్తగా అపెక్స్ కమిటీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలోనే నీటి కేటాయింపులు చేసి, సర్వేలు చేసి, కొంత ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను తప్పుబడతారా, రాజకీయాల కోసం ఇంత అబద్ధాలాడతారా? అని మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత అనుమతుల్లేకుండా పట్టిసీమ ప్రాజెక్టు కట్టి, విభజన చట్టాన్ని ఉల్లంఘించింది చంద్రబాబేనని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు