'ముక్కుల పుల్లపెట్టుకుని తుమ్మినట్లుంది'

3 May, 2016 20:58 IST|Sakshi
'ముక్కుల పుల్లపెట్టుకుని తుమ్మినట్లుంది'

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు మంగళవారం నిప్పులు చెరిగారు. శుభకార్యం జరుగుతుంటే ముక్కుల పుల్లపెట్టుకుని తుమ్మినట్లుందని ఏపీ కేబినెట్ తీరును హరీష్ రావు  ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమిపూజ చేసుకుని తెలంగాణ ప్రజలు సంబురపడుతుంటే కండ్లమంటతో చంద్రబాబు తీర్మానం చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఆయన మంత్రి వర్గానికి మానవత్వం లేదనడానికి ఇదో ఉదాహరణ అని హరీష్రావు అన్నారు.

దీక్ష చేస్తానంటున్న వైఎస్ జగన్పై పైచేయి సాధించడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి... ఏపీ కుటిల రాజకీయాల కోసం తెలంగాణ రైతులతో పాటు ప్రాజెక్టులను బలి చేయాలనుకోవడం వారి వంకర బుద్ధిని బయటపెడుతున్నదని చెప్పారు. ఏపీ కేబినెట్ తీర్మానం చెల్లని రూపాయి అని వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ కావాలని తాము పోరాడినప్పుడు కూడా ఆంధ్ర నాయకులు ఇవే కాకిలెక్కలు చెప్పారని హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ప్రపంచంలో ఎవరూ నమ్మలేదన్నారు. దేశంలోని అన్ని పార్టీలూ తమ తెలంగాణ వాదనే కరెక్టు అని చెప్పాయన్నారు. ప్రస్తుతం నీటిపారుదల రంగంలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారని... వాటిని కూడా ఎవరూ నమ్మరని హరీష్ రావు స్పష్టం చేశారు. న్యాయం, ధర్మం, నీతి తమ వైపు ఉన్నాయని చెప్పారు. ధర్మమే గెలుస్తుంది.... నీతి నిలబడుతుంది. ఏపీ కేబినెట్ చేసిన తీర్మానానికి విలువ లేదు కాబ్టటే కోర్టుల్లో పోతామంటున్నారన్నారు.

కోర్టుల్లో కేసును ఏండ్లకు ఏండ్లు సాగదీసి ప్రాజెక్టులు కట్టకుండా చూడాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కానీ ఇప్పుడున్నది ఎడ్డి, గుడ్డి తెలంగాణ కాదని... మేల్కొన్న బొబ్బిలి అని స్పష్టం చేశారు. ఎవరు ఎంత అడ్డుపడినా తెలంగాణను అపలేకపోయారని, అలాగే ఇప్పుడు ప్రాజెక్టులు కూడా ఆపలేరన్నారు. ప్రాజెక్టులు కట్టి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తానే ప్రాజెక్టుల దగ్గర కూర్చుని, అక్కడే నిద్రపోయి ప్రాజెక్టులను పూర్తి చేస్తానన్నారు. నీళ్ల దోపిడీపై చర్చకు సిద్ధమా? అని టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు.

''తాము కృష్ణా బేసిన్లోనే ఉన్న పాలమూరు, నల్గొండ జిల్లాలకు కృష్ణా నీరు ఇస్తామంటే అడ్డు తగులుతారా? కృష్ణా బేసిన్లో ఉన్న జిల్లాలను ఎండబెట్టి, పెన్నా బేసిన్లోని ప్రాంతాలకు నీరివ్వడం న్యాయమా? దీనికి ఏ ట్రిబ్యునల్ ఒప్పుకుంటది? ఏ కోర్టు ఒప్పుకుంటది? ఎవరి అనుమతి తీసుకున్నరు? నీళ్ల దోపిడీపై చర్చకు చంద్రబాబు సిద్ధమా? సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించమని కేంద్రానికి లేఖ రాయగలరా? కేంద్రానికి లేఖ రాస్తామంటున్నారు కదా, అదే చేతితో తెలంగాణ, ఆంధ్ర ప్రాజెక్టులన్నింటిపై విచారణ జరపాలని రాయండి'' అని టీడీపీ నాయకులకు హరీష్ రావు సూచించారు.

మరిన్ని వార్తలు