హరితహారంలో గులాబీ దళం

8 Jul, 2016 03:15 IST|Sakshi
హరితహారంలో గులాబీ దళం

విధిగా పాల్గొనాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమంలో పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికార టీఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ మేరకు పార్టీ అధినాయకత్వం ఇప్పటికే జిల్లా నాయకత్వాలకు సూచనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకుపోవాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలకూ ఉందని సీఎం కేసీఆర్ పలుమార్లు పార్టీ వేదికల్లో పేర్కొన్నారు. తాజాగా ఆయన రెండో విడత ‘హరిత హారం’ కార్యక్రమాన్ని శుక్రవారం నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్నారు. ఇందులో పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో భాగస్వాములను చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 
గుర్తింపు కోసం నేతల ఆరాటం
ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా గుర్తింపు పొందేందుకు జిల్లాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఆరాటపడుతున్నారు. తమ పరిధిలో విరివిగా భాగం పంచుకోవడం ద్వారా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిలో పడే అవకాశం ఉండడంతో హరిత హారాన్ని సదవకాశంగానే పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రభుత్వ నామినేటెడ్ పదవులు భర్తీ కాకపోవడం, మండల స్థాయి పదవులు మొదలు అన్ని పదవులకు విపరీతమైన పోటీ ఉండడంతో మరోసారి నేతల దృష్టిని ఆకర్షించేందుకు ఇదే తరుణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సహజంగానే ఇది పార్టీ కేడర్ మధ్య పోటీ వాతావరణాన్ని సృష్టించిందని.. రెండు వారాల పాటు సాగే హరితహారంలో కార్యకర్తలంతా విరివిగా పాల్గొంటే కార్యక్రమం విజయవంతం అవుతుందని అగ్రనాయకత్వం భావిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులను భాగస్వామ్యం చేస్తామని తొలి నుంచీ చెబుతున్నా వాస్తవంలో అంతగా సాధ్యం కాలేదు. కానీ హరితహారం మాత్రం విస్తృత కార్యక్రమం కావడం, ప్రజల భాగస్వామ్యం ఉండడంతో నేతలు ప్రజల్లోకి వెళ్లడానికి అందివచ్చిన అవకాశమని అభిప్రాయపడుతున్నారు.
 
హరిత తెలంగాణ కోసం
హరిత తెలంగాణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక కార్యకర్తలకు కూడా బాధ్యతలు అప్పజెప్పనున్నారు. ఉద్యమ స్థాయిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపు ఇచ్చిన నేపథ్యంలో... ముందుగా పార్టీ శ్రేణులను భాగస్వామ్యం చేయడం ద్వారా ఊపు తేవాలని టీఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా స్థానిక ప్రజాప్రతినిధులకు కార్యకర్తలను భాగస్వాములను చేయాలని ఆదేశాలు వెళ్లినట్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు