ఉచిత పథకాలు రద్దు చేయాలి

5 Jul, 2016 00:32 IST|Sakshi
ఉచిత పథకాలు రద్దు చేయాలి

ఫ్యాప్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపులో గవర్నర్
- సబ్సిడీలకు బదులు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలి
- మన విద్యావ్యవస్థలో కొత్త  ఆలోచనలకు చోటే లేదు
- పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యం ఉండడంలేదని వ్యాఖ్య
 
 సాక్షి, హైదరాబాద్ : భారీ ఎత్తున అమలవుతున్న ఉచిత (సబ్సిడీ) పథకాలను రద్దు చేస్తేనే ప్రయోజనకరమని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించారు. సబ్సిడీలకు బదులు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తే ప్రజలు ఆర్థికంగా బలోపేతం అవుతారని పేర్కొన్నారు. స్వయంకృషితో సంపాదించిన డబ్బుతో ప్రతి పౌరుడు గర్వంగా బతకాలని, అలా బతకడంలోనే ఆనందం ఉందని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ‘ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ)’ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

వందేళ్లు పూర్తి చేసుకున్న ఫ్యాప్సీకి గవర్నర్ అభినందనలు తెలిపారు. ప్రస్తుత యుగంలో నూతన ఆవిష్కరణలకు ఎంతో ఆవశ్యకత ఉందని... దురదృష్టవశాత్తు మన విద్యావ్యవస్థలో కొత్త ఆలోచనలకు చోటే లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మన ఇంజనీరింగ్ కళాశాలల నుంచి బయటికి వస్తున్న ఇంజనీర్లలో పరిశ్రమల అవసరాలకు తగినట్లు నైపుణ్యం ఉండడం లేదని... అసలు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఒకటి ఉందని తాను భావించడం లేదని వ్యాఖ్యానించారు. ఈ లోటును పూడ్చేందుకు విద్యా సంస్థలతో పరిశ్రమలు అనుసంధానమై నైపుణ్య అభివృద్ధి శిక్షణలో సహకరించాలని సూచించారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యోగావకాశాలు, పరిశుద్ధ వాతావరణం, ఆహార, ఆరోగ్య భద్రతను కల్పించేందుకు కృషి చేయాలని పారిశ్రామికవేత్తలను గవర్నర్ కోరారు.


 గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టండి: ఫ్యాప్సీ అంటే బడా పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలకు సంబంధించిన సంస్థగా అపోహ ఉందని, చిన్న పరిశ్రమలను సైతం ప్రోత్సహిస్తుండడం అభినందనీయమని గవర్నర్ పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు హైదరాబాద్, విజయవాడ లాంటి పట్టణాలపైనే కాకుండా గ్రామీణ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఓ వంద చెట్లను నాటడం, బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించడం, దీపావళి లాంటి పండుగలు, క్రీడా ఉత్సవాల కోసం పరిశ్రమలు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను వెచ్చిస్తున్నాయని, ఇది సామాజిక బాధ్యత అనిపించుకోదని పేర్కొన్నారు. ఫ్యాప్సీ వందేళ్ల పాటు ఎలా నిలబడిందో అలానే శాశ్వతంగా నిలిచిపోయే పనులను చేయడమే అసలైన సామాజిక బాధ్యత అని చెప్పారు.

ప్రతి పరిశ్రమ కనీసం 10 గ్రామాలను దత్తత తీసుకుని మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతలను శాశ్వతంగా చేపట్టాలన్నారు. ఆ దిశగా ఫ్యాప్సీ చొరవ చూపాలని సూచించారు. వచ్చే పదేళ్లలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఆర్థికంగా దేశంలో అగ్రస్థానంలో ఉండేలా కృషి చేయాలని, ఈ సవాలును పారిశ్రామికవేత్తల ముందు ఉంచుతున్నానని చెప్పారు. 2 రాష్ట్రాల్లో విజన్ ఉన్న నాయకత్వంతో పాటు మానవ వనరులు, భూములు, అద్భుతమైన పారిశ్రామిక విధానాలు ఉన్నాయని... వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్సీ అధ్యక్షుడు రవీంద్ర మోదీ, ఉపాధ్యక్షులు గోరా శ్రీనివాస్, అరుణ్ లుహారుక, శతాబ్ది ఉత్సవాల చైర్మన్ అనిల్‌రెడ్డి వెన్నం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు